
రాజీవ్ సాతవ్
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఏఐసీసీలో మార్పులకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా గుజరాత్, ఒడిశా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జులుగా ఎంపీ రాజీవ్ సాతవ్, కేంద్ర మాజీ మంత్రి జితేంద్ర సింగ్‌ను నియమించారు. పార్టీ ఆర్గనైజింగ్, ట్రైనింగ్ ఇన్‌చార్జిగా ఉన్న జనార్దన్ త్రివేదిని తప్పించి ఆ స్థానంలో రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌ను నియమించారు. గెహ్లాట్‌ను కిందటేడాది గుజరాత్‌ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా నియమించారు. త్వరలో రాజస్తాన్ ఎన్నికలున్న దృష్ట్యా ఆయన్ను ప్రస్తుతం ఆ బాధ్యతల నుంచి తప్పించారు.
సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్‌గా లాల్జీ దేశాయ్
అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్‌గా గుజరాత్ పీసీసీ ప్రధాన కార్యదర్శి లాల్జీ దేశాయ్‌ను నియమించారు. ఇప్పటివరకూ మహేంద్ర జోషి ఆ బాధ్యతలను నిర్వహించారు. రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ యువతకు ప్రాధాన్యం ఇస్తుందన్న సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో పార్టీలో మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.