కుతుబ్‌షాహీ టూంబ్స్‌కు కొత్త కళ.. | Sakshi
Sakshi News home page

కుతుబ్‌షాహీ టూంబ్స్‌కు కొత్త కళ..

Published Sun, Mar 1 2015 7:25 AM

కుతుబ్‌షాహీ టూంబ్స్‌కు కొత్త కళ..

న్యూఢిల్లీ: చారిత్రక వారసత్వ సంపద అయిన కుతుబ్‌షాహీ సమాధుల (టూంబ్స్)కు త్వరలోనే పర్యాటక కళ చేకూరనుంది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ కట్టడాల వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రపంచ వారసత్వ హోదా పొందిన దాదాపు 25 ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల కల్పన, సుందరీకరణ, పార్కులు, టాయిలెట్లు, భద్రతా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ తెలిపారు.

తొలుత హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ సమాధులు, కర్ణాటకలోని హంపి, పాత గోవా ప్రాంతంలోని చర్చిలు, రాజస్థాన్‌లోని కుంభాల్‌గఢ్ తదితర కోటలు, గుజరాత్‌లోని రాణీకి వావ్, కశ్మీర్‌లోని లెహ్ ప్యాలెస్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, పంజాబ్‌లోని జలియన్‌వాలా బాగ్ ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
 
మరిన్ని దేశాలకు ‘వచ్చాకే వీసా’..
విదేశీ పర్యాటకులు మన దేశానికి వచ్చాక విమానాశ్రయాల్లో తాత్కాలిక వీసా తీసుకునే (వీసా ఆన్ అరైవల్) సదుపాయాన్ని 150 దేశాలకు విస్తరిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. ఇంతకు ముందు 43 దేశాలకు సంబంధించి ఈ సౌకర్యం అందుబాటులో ఉండేది. ఈ చర్యలు ముదావహమని కాక్స్ అండ్ కింగ్స్ సంస్థ డెరైక్టర్ పీటర్ కెర్కర్, థామస్ కుక్ ఇండియా విభాగం ఎండీ మాధవన్ మీనన్ చెప్పారు. బడ్జెట్‌లో నిర్ణయాలు పర్యాటకానికి మంచి ఊపునిస్తుందని ‘మేక్ మై ట్రిప్’ వెబ్‌సైట్ సీఈవో రాజేష్ మాగోవ్ పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement