యజమానిని కాపాడిన మూగజీవి

In Pune Dog saves Doctor Life - Sakshi

పూణె : విశ్వాసంలో కుక్కను మించిన జీవి ఈ ప్రపంచంలో మరోటి ఉండదు. దీన్ని రుజువు చేసే సంఘటన మరొకటి జరిగింది. చావు అంచుల వరకూ వెళ్లిన యజమానిని బతికించుకుంది కుక్క. వివరాలు.. పూణెకు చెందిన రమేష్‌ సంచేటి (65) అనే వైద్యుడు ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. దాని పేరు బ్రౌనీ. ఈ కుక్క కోసం ప్రత్యేకంగా అమిత్‌ షా అనే నౌకర్ని కూడా నియమించాడు రమేష్‌. బ్రౌనీకి సంబంధించిన విధులన్నింటిని అమిత్‌ చూసుకునేవాడు. ఈ క్రమంలో ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో బ్రౌనీకి భోజనం పెట్టడానికి వచ్చాడు అమిత్‌.

అయితే అది భోజనం చేయడానికి నిరాకరించి.. రమేష్‌ గది ముందు పచార్లు చేయసాగింది. అనుమానం వచ్చిన అమిత్‌.. రమేష్‌ గదిలోకి తొంగి చూడగా.. అతను నేల మీద పడిపోయి ఉన్నాడు. ప్రమాదం జరిగి ఉంటుందని భావించిన అమిత్‌ గది తలుపులు పగలకొట్టి లోనికి ప్రవేశించాడు. అపస్మారక స్థితిలో ఉన్న రమేష్‌ని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించాడు. రమేష్‌ను పరీక్షించిన వైద్యులు అతనికి కార్డియాక్‌ అరెస్ట్‌ అయ్యిందని.. ఏం మాత్రం ఆలస్యం చేసి ఉన్నా రమేష్‌ మరణించేవాడని తెలిపారు. ఈ విషయం గురించి అమిత్‌ మాట్లాడుతూ.. ‘బ్రౌనీ సమయానికి నన్ను అప్రమత్తం చేయబట్టి సరిపోయింది. ఈ రోజు రమేష్‌ ప్రాణాలతో ఉన్నారంటే అందుకు బ్రౌనీనే కారణం’ అని తెలిపాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top