
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు కేంద్ర మంత్రిమండలి చేసిన తీర్మానానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు.
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర మంత్రిమండలి చేసిన సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేశారు. మంత్రిమండలి తీర్మానాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. నవంబర్ 8న అసెంబ్లీ పదవీకాలం ముగిసినా తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొనడంతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ పంపారు. గవర్నర్ సిఫార్సును కేంద్ర మంత్రిమండలి ఆమోదించి రాష్ట్రపతికి నివేదించింది. మహారాష్ట్రలో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ దక్కపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సీఎం పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలన్న శివసేన ఫిఫ్టీఫిఫ్టీ ఫార్ములాకు బీజేపీ సమ్మతించలేదు.
మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేసిన ప్రయత్నాలకు ఎన్సీపీ, కాంగ్రెస్‌లు గవర్నర్ విధించిన డెడ్‌లైన్‌లోగా సహకరించలేదు. ఎన్సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించి మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని కోరారు. అయితే తమకు మరో 48 గంటల గడువు కావాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కోరడంతో గవర్నర్ రాష్ట్రపతి పాలన దిశగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో రాజ్యంగ బద్ధంగా ప్రభుత్వ ఏర్పాటయ్యే పరిస్థితి లేదని గవర్నర్ స్పష్టం చేశారు. మొత్తంమీద రాష్ట్రపతి పాలనతో రెండు వారాలు పైగా సాగిన మహా డ్రామాకు తెరపడింది.