బడ్జెట్‌ తయారీ ఇలా..

prepare budget plan - Sakshi

బడ్జెట్‌ అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు! కానీ ఈ మూడక్షరాల వెనుక చాలా కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. ఆద్యంతం గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది. అదేంటో ఓ లుక్కేయండి!

సెప్టెంబర్లో..
రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌కు కేటాయిస్తుంది.

అక్టోబర్లో..
తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చల్లో తలమునకలవుతారు.

డిసెంబర్‌
ముసాయిదా బడ్జెట్‌ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి.

జనవరి..
పారిశ్రామిక, బ్యాంకింగ్‌ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు.

ముద్రణ ప్రక్రియ
బడ్జెట్‌కు సంబంధించిన అన్ని వివరాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు జనవరి నుంచి ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయాల్లోకి జర్నలిస్టుల ప్రవేశాన్ని నిషేధిస్తారు.

ఫోన్‌ ట్యాపింగ్‌
బడ్జెట్‌ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్‌ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్‌ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్‌ చేస్తుంటుంది.

మూడో కన్ను..
ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కనీసం కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు.

అంతా ప్రత్యేకం
బడ్జెట్‌ పత్రాలను తయారు చేసే ‘ప్రింటింగ్‌ ప్రెస్‌’ సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుం డా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.

ఆహారంపైనా..
ప్రింటింగ్‌ ప్రెస్‌ సిబ్బందికి అందించే తిండిపై అత్యంత జాగ్రత్త తీసుకుంటారు. ఏ ఆహారాన్నైనా పరీక్షించిన తర్వాతే వారికి ఇస్తారు.

నీడలా వెన్నంటే..
ముద్రణ విభాగంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా  బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్‌ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు.

ఫిబ్రవరి 1న..
ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి పార్లమెంటుకు బడ్జెట్‌ను సమర్పిస్తారు. సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి బడ్జెట్‌ గురించి స్థూలంగా వివరిస్తారు.

బడ్జెట్‌ లీక్‌..
పరీక్ష పేపర్లే కాదు.. బడ్జెట్‌ పేపర్లు కూడా లీకైన సంఘటన 1950లో చోటుచేసుకుంది. అప్పట్లో బడ్జెట్‌ పత్రాల్ని రాష్ట్రపతి భవన్‌లో ముద్రించేవారు. 1950లో ఈ పత్రాలు లీక్‌ కావడంతో అప్పట్నుంచీ మింట్‌రోడ్‌లోని సెక్యూరిటీ ప్రెస్‌కు వేదికను మార్చారు. 1980 నుంచి ఢిల్లీలోని నార్త్‌ బ్లాక్‌లో బడ్జెట్‌ పత్రాల్ని ముద్రిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రింటింగ్‌ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top