మే 3 తరువాత కూడా! | PM Narendra Modi hints at lockdown extension in Covid-19 hotspots | Sakshi
Sakshi News home page

మే 3 తరువాత కూడా!

Apr 28 2020 4:37 AM | Updated on Apr 28 2020 9:45 AM

PM Narendra Modi hints at lockdown extension in Covid-19 hotspots - Sakshi

ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత రెండో విడత దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మే 3న ముగుస్తుంది. ఒకేసారి దేశవ్యాప్తంగా కాకుండా, కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని, మిగతాచోట్ల లాక్‌డౌన్‌ నిబంధనలకు చాలావరకు మినహాయింపు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ప్రధాని ఇదే అభిప్రాయాన్ని సూచనప్రాయంగా వ్యక్తం చేశారని తెలుస్తోంది. ‘ఇప్పటివరకు రెండు లాక్‌డౌన్‌లను ప్రకటించాం.

రెండూ వేర్వేరు తరహా నిబంధనలున్నవి. ఆ దిశగా ఆలోచించాలి. రానున్న కొన్ని నెలల పాటు కరోనా ప్రభావం ఉండబోతోందని నిపుణులు చెబుతున్నారు’అని సీఎంలతో మోదీ పేర్కొన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లాక్‌డౌన్‌ నుంచి దశలవారీగా బయటకు వచ్చే వ్యూహాన్ని సిద్ధం చేయాల్సిందిగా ప్రధాని సూచించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్‌ ఎగ్జిట్‌ వ్యూహాలను స్థానిక పరిస్థితులను బట్టి రాష్ట్రాలే రూపొందించుకోవాలని మోదీ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(ఆంధ్రప్రదేశ్‌), కేసీఆర్‌(తెలంగాణ), కేజ్రీవాల్‌(ఢిల్లీ), ఉద్ధవ్‌ ఠాక్రే(మహారాష్ట్ర), పళనిస్వామి(తమిళనాడు), కన్రాడ్‌ సంగ్మా(మేఘాలయ), యోగి ఆదిత్యనాథ్‌(యూపీ) తదితరులు పాల్గొన్నారు.  

సీఎంల ప్రశంసలు
కరోనా కట్టడికి తమ రాష్ట్రాల్లో తాము చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రులు ప్రధానికి వివరించారు. అంతర్జాతీయ సరిహద్దులపై గట్టి నిఘా పెట్టాలని, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు, ఆరోగ్య రంగంలో మౌలిక వసతులను పెంచేందుకు చర్యలు చేపట్టాలని పలువురు ప్రధానికి సూచించారు. కరోనా సంక్షోభ సమయంలో సమర్థ నాయకత్వం అందిస్తున్నారని పలువురు ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించారు. కరోనాపై పోరులో వైద్య సిబ్బంది, పోలీసుల కృషిని నేతలంతా కొనియాడారు. ముఖ్యమంత్రులతో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానితో పాటు హోంమంత్రి అమిత్‌ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ప్రధాని కార్యాలయంలోని, ఆరోగ్య శాఖలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సవాళ్లను అవకాశాలుగా మార్చుకోండి
కరోనా కారణంగా తలెత్తిన సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలని ముఖ్యమంత్రులతో వీడియో భేటీ సందర్భంగా సీఎంలకు ప్రధాని మోదీ ఉద్బోధించారని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా లాక్‌డౌన్‌ నుంచి బయటకు వచ్చే వ్యూహాలను రాష్ట్రాల వారీగా రూపొందించుకోవాలని ప్రధాని సూచించారని వెల్లడించింది. కరోనా ప్రభావం మరికొన్ని నెలలు ఉంటుందని, మాస్క్‌లు, శానిటైజర్ల వాడకాన్ని కొనసాగించాలని ప్రధాని చెప్పారని మహారాష్ట్ర సీఎంఓ తెలిపింది.  

మేఘాలయలో కొనసాగింపు
లాక్‌డౌన్‌ను మే 3 తరువాత కూడా కొనసాగించాలని మేఘాలయ నిర్ణయించింది. గ్రీన్‌ జోన్స్‌లో, కరోనా ప్రభావం లేని జిల్లాల్లో మాత్రం మినహాయింపు ఇస్తామని పేర్కొంది.

ఆర్థికం కూడా కీలకమే
కోవిడ్‌–19ను నియంత్రించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికీ ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు దిశా నిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్‌ డౌన్‌ నిబంధనల అమలు, ఆంక్షలపై మినహాయింపులు తదితర అంశాలపై వారు చర్చించారు. వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న హాట్‌స్పాట్స్‌లో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రధాని సీఎంలకు సూచించారు. లాక్‌డౌన్‌ వల్ల సత్ఫలితాలు వచ్చాయని, వేలాది ప్రాణాలను కాపాడగలిగామని చెప్పారు.

‘కొన్ని దేశాల జనాభా మొత్తం కలిస్తే భారత్‌ జనాభాతో సమానమవుతుంది. మార్చి మొదటివారంలో భారత్‌ సహా చాలా దేశాల్లో కరోనా తీవ్రత దాదాపు ఒకేలా ఉంది. అయితే, సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భారత ప్రభుత్వం విలువైన వేలాది ప్రాణాలను కాపాడగలిగింది’అని ప్రధాని వ్యాఖ్యానించారు. అయితే, కరోనా మహమ్మారి ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని ఆయన హెచ్చరించారు. అప్రమత్తంగా ఉంటూ, ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన నిబంధనలను పాటించేలా చూడాల్సి ఉందన్నారు. రెడ్‌ జోన్స్‌ను ఆరెంజ్‌ జోన్స్‌గా, ఆ తరువాత వైరస్‌ రహిత గ్రీన్‌ జోన్స్‌గా మార్చే దిశగా వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు. ‘కేసుల సంఖ్య పెరగడం నేరమేమీ కాదు. కేసుల సంఖ్య పెరుగుతోందని ఒత్తిడి, ఆందోళన చెందకండి.

ఈ సమస్య దేశమంతా ఉంది’అని ప్రధాని సీఎంలతో వ్యాఖ్యానించారు. భౌతిక వ్యాప్తికి సంబంధించి ‘రెండు గజాల దూరం’మంత్రాన్ని అంతా అనుసరించాలన్నారు. వేసవికాలం, వర్షాకాలాల్లో వైరస్‌ వ్యాప్తిని అంచనా వేస్తూ.. తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సీఎంలకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తు జన జీవనంలో ఇక మాస్క్‌లు భాగం అవుతాయన్నారు. కరోనాపై పోరులో, ఆర్థిక పునరుజ్జీవనంలో సాధ్యమైనంత వరకు సాంకేతికతను వినియోగించుకోవాలని, సామాన్యుడికి లబ్ధి చేకూర్చే మరిన్ని సంస్కరణలు చేపట్టే దిశగా ఆలోచించాలని ప్రధాని సూచించారు. విద్యా సంస్థల్లోని శాస్త్రవేత్తలు సమన్వయంతో ఈ కరోనా మహమ్మారిని అంతం చేసే దిశగా ప్రయోగాలు చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement