నేడు విదేశాలకు మోదీ

pm narendra modi foreign tour - Sakshi

న్యూఢిల్లీ: ఆసియా దేశాలైన ఇండోనేసియా, సింగపూర్, మలేసియాలతో భారత్‌కు బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ మూడు దేశాల్లో తన పర్యటనతో ప్రస్తుతమున్న సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్నారు. మే 29 నుంచి జూన్‌ 2వరకూ మోదీ ఇండోనేసియా, సింగపూర్, మలేసియాల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తన పర్యటన వివరాలను ప్రధాని ఫేస్‌బుక్‌లో పంచుకున్నారు. ఇండోనేసియా రాజధాని జకార్తాకు మే 29న చేరుకోనున్నట్లు మోదీ తెలిపారు. మరుసటిరోజు ఆ దేశ ప్రధాని జోకో విడోడోతో భేటీ అవుతానన్నారు.

ఆతర్వాత ఇండియా–ఇండోనేసియా సీఈవో ఫోరమ్‌తో, ఇక్కడి భారత సంతతి ప్రజలతో సమావేశమవుతానని వెల్లడించారు. అనంతరం మే 31న సింగపూర్‌కు వెళ్తానన్నారు. ఈ పర్యటనలో టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, పట్టణ ప్రణాళిక, కృత్రిమ మేథ రంగాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు పెంపొందించడంపై దృష్టి సారిస్తామన్నారు. జూన్‌ 1న సింగపూర్‌ ప్రధాని లీతో సమావేశమవుతానని మోదీ తెలిపారు. సింగపూర్‌కు వెళ్లేముందు మలేసియాలో ఆగి ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మహతీర్‌ మొహమ్మద్‌కు శుభాకాంక్షలు తెలపనున్నట్లు మోదీ చెప్పారు. సింగపూర్‌లో 28 ఆసియా–పసిఫిక్‌ దేశాల రక్షణమంత్రులు, ఆర్మీచీఫ్‌లు హాజరయ్యే షాంగ్రీలా సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top