2022 నాటికి అందరికీ ఇళ్లు | PM Modi interacts with PMAY beneficiaries | Sakshi
Sakshi News home page

2022 నాటికి అందరికీ ఇళ్లు

Jun 6 2018 1:44 AM | Updated on Aug 15 2018 2:40 PM

PM Modi interacts with PMAY beneficiaries - Sakshi

న్యూఢిల్లీ: దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే 2022 నాటికి ప్రతి భారతీయునికి సొంతిల్లు కల్పించేలా ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గృహ నిర్మాణ రంగం నుంచి అవినీతి, దళారుల బెడదను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

పేదలకు చవక ధరలో వేగంగా ఇళ్లు నిర్మించేందుకు అధునాతన సాంకేతికత తోడ్పడుతోందని తెలిపారు. ఎన్డీయే నాలుగు వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మోదీ మంగళవారం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో ముచ్చటించారు. గత ప్రభుత్వం కన్నా ఎంతో  మిన్నగా తక్కువ ధరకు, వేగంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్నామని అన్నారు.

సమయం తగ్గింది..సాయం పెరిగింది..
‘లబ్ధిదారులు సొంత ఇళ్లను పొందడంలో అవరోధాలు ఏర్పడకుండా చూసేందుకు అవినీతి, మధ్యవర్తులను తొలగించడానికి కృషిచేస్తున్నాం. అధునాతన సాంకేతికత గృహ నిర్మాణ రంగానికి కొత్త శక్తినిచ్చింది. దాని వల్ల వేగంగా, చవక ధరలకే ఇళ్ల నిర్మాణం పూర్తవుతోంది. ఈ పథకంలో అధిక ప్రాధాన్యం మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకే ఇస్తున్నాం.

పీఎంఏవై ప్రజల గౌరవంతో ముడిపడి ఉన్న పథకం. ఈ పథకం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. అందరికీ ఇళ్లు కల్పించాలన్న లక్ష్యాన్ని నాలుగేళ్లుగా ఒక దీక్షగా చేపట్టాం. 2022 నాటికి ప్రతి భారతీయుడు సొంత ఇంటిని కలిగి ఉండేలా ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ పథకం కింద ఒక ఇంటి నిర్మాణానికి పడుతున్న సమయాన్ని 18 నెలల నుంచి 12 నెలలకు తగ్గించాం.

ఇంటి పరిమాణాన్ని 20 చ.మీ. నుంచి 25 చ.మీ.కు పెంచాం. ఆర్థిక సాయం ఒక్కో ఇంటికి రూ.75 వేల నుంచి రూ.1.25 లక్షలకు పెరిగింది. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో కోటి, పట్టణాల్లో మూడు కోట్ల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పట్టణాల్లో 47 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చాం’ అని మోదీ అన్నారు.

ఉత్తమ వర్సిటీల్లో మనవీ ఉండాలి..
భారత విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోని ఉత్తమ వర్సిటీల సరసన చేరేలా కృషిచేయాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ఈ విషయంలో గవర్నర్లే చాన్స్‌లర్ల హోదాలో విశ్వవిద్యాలయాలకు చోదకశక్తిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. వివిధ రాష్ట్రాల మధ్య సామరస్యం, సయోధ్యను ప్రోత్సహించేందుకు గవర్నర్లు చొరవచూపాలని అన్నారు.

రాష్ట్రపతి భవన్‌లో మంగళవారం ముగిసిన రెండు రోజుల గవర్నర్ల సదస్సులో మోదీ ప్రసంగించారు. విద్యా విషయాల్లో వర్సిటీలు అత్యుత్తమ ప్రమాణాలు సాధించేలా గవర్నర్లు క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు.  భారత 75వ స్వాతంత్య్ర వేడుకలు(2022), గాంధీ మహాత్ముడి 150వ జయంతి(2019) లాంటి సందర్భాలు అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రేరేపకాలుగా పనిచేస్తాయన్నారు.  

పర్యావరణహితంగా అభివృద్ధి
అభివృద్ధి పర్యావరణహితంగా ఉండాలని, ప్రకృతిని పణంగా పెట్టి దాన్ని సాధించకూడదని ప్రధాని మోదీ అన్నారు. ప్రకృతితో సహజీవనం చేయాల్సిన ప్రాధాన్యాన్ని మన సంప్రదాయాలు, ఆచారాలు వివరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు.

‘బీట్‌ ప్లాస్టిక్‌ పొల్యూషన్‌’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాది భారత్‌ ఆతిథ్యమిచ్చిన ప్లీనరీ కార్యక్రమానికి మోదీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ..మొత్తం మానవాళికే ప్లాస్టిక్‌ ముప్పుగా మారేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement