విదేశీ పర్యటనల సమయంలో మోదీ బస అక్కడే!

PM Modi Avoids Hotels In Foreign Tour Says Amit Shah - Sakshi

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ చాలావరకు విదేశీ పర్యటనల ఖర్చు తగ్గించారని హోం మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. ప్రధాని మోదీ విపరీతంగా ఖర్చు పెడుతున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. నిన్న లోక్‌సభలో ఎస్పీజీ చట్ట సవరణ బిల్లుపై మాట్లాడిన సందర్భంలో అమిత్‌ షా ఈ విషయాన్ని ప్రస్తావించారు. విదేశీ పర్యటనలకు వెళ్లే సందర్భంలో విమానం ఆలస్యమైనా, సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా మోదీ హోటళ్లలో ఉండేందుకు ఇష్టపడేవారు కాదన్నారు. గతంలో విదేశీ పర్యటనకు ఆటంకం ఏర్పడితే ప్రధాని సహా అధికారులు ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలోనే బస చేసేవారు. దీనివల్ల ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయేవి.

కానీ మోదీ అందుకు విరుద్ధంగా ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో బస చేయకూడదని నిర్ణయించుకున్నారు. లగ్జరీ హోటళ్లను ఆశ్రయించకుండా ఎయిర్‌పోర్టులోని టర్మినల్‌లోనే బస చేసి, అక్కడే స్నానం చేసేవారని చెప్పుకొచ్చారు. ‘వ్యక్తిగతంగా మోదీ చాలా నిబద్ధత గల వ్యక్తి. తను పర్యటనకు వెళ్లినప్పుడు 20 శాతం కన్నా తక్కువ సిబ్బందిని మాత్రమే తన వెంట తీసుకెళతారు. సాధారణంగా అధికారులు సమావేశాలకు వెళ్లినప్పుడు చాలామటుకు ప్రత్యేక కార్లలోనే ప్రయాణిస్తారు. కానీ మోదీ అందుకు భిన్నంగా కార్లలో ప్రయాణించడానికి సుముఖత చూపరు. బస్సులో లేదా ఏదైనా పెద్ద వాహనంలో వెళతారు. ఇలా చాలావరకు మోదీ విదేశీ ప్రయాణ ఖర్చులను తగ్గించేవారని అమిత్‌ షా పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top