పూలన్‌ దేవి హత్య: పెళ్లిపీటలెక్కిన ప్రధాన నిందితుడు

Phoolan Devi murder accused Sher Singh gets married - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బందిపోటు రాణిగా ప్రఖ్యాతి గాంచిన పూలన్‌దేవి హత్య కేసులో నిందితుడు షేర్ సింగ్ రాణా(41) మరోసారి వార్తల్లో నిలిచాడు. షేర్ సింగ్ నిన్న (మంగళవారం) వివాహం చేసుకోవడంతో పూలన్‌ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. పూలన్‌దేవి హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న షేర్ సింగ్ కొంతకాలం కిందట బెయిల్ మీద బయటకు వచ్చాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే కూతురు ప్రతిమా సింగ్‌తో కలిసి షేర్ సింగ్ పెళ్లిపీటలెక్కాడు. ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో వైభవంగా ఈ వివాహం జరిగింది. ప్రతిమాసింగ్‌తో వివాహం అనంతరం షేర్ సింగ్ రాణా మీడియాతో మాట్లాడాడు. 'అంతా దేవుడి మీద భారం వేశాను. కేసు నుంచి బయట పడేందుకు ఎంతకాలం పడుతుందో తెలియదు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందేనని' షేర్ సింగ్ అన్నాడు.

బందిపోటుగా జీవనం సాగించిన అనంతరం ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకున్న పూలన్‌దేవి సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ)లో చేరారు. ఎస్పీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2001 జూలై 25న ఢిల్లీలోని తన నివాసం ముందు ఆమె హత్యకు గురైన విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలకు హాజరై మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చిన ఆమెను షేర్ సింగ్ రాణా సహా ముగ్గురు దుండగులు అతి దగ్గర నుంచి ఆమెను కాల్చి చంపారు. 2014 ఆగస్టులో ఢిల్లీ కోర్టు జీవితఖైదు విధించగా.. రాణా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. 2016లో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top