
17 నుంచి పార్లమెంట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : ఈనెల 17 నుంచి 26 వరకూ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. రాజ్యసభలో సభానాయకుడిగా కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లోట్ నియమితులయ్యారు. బీజేపీ సీనియర్‌నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ స్ధానంలో గెహ్లాట్ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. రాజ్యసభలో ఉపనాయకుడిగా పీయూష్ గోయల్ వ్యవహరిస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాజ్యసభ నేతను నియమిస్తుంది.
లోక్‌సభలో సభా నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపనాయకుడిగా రాజ్‌నాథ్ సింగ్ వ్యవహరించనున్నారు. ఈనెల 17 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానుండగా 20 నుంచి రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు 17, 18 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈనెల 19న స్పీకర్ ఎన్నిక జరగనుండగా, 20న పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రసంగిస్తారు.