పాకిస్తాన్‌ మూల్యం చెల్లించక తప్పదు

Pakistan Will Pay For Attack on Sunjunwala Says Defence Minister - Sakshi

సంజువాన్‌ ఉగ్రదాడిపై భారత్‌ హెచ్చరిక

ఉగ్రవాదులంతా పాకిస్తానీయులే..

జైషే ప్రమేయంపై ఆధారాలు సేకరించాం.. పాక్‌కు అందచేస్తాం

రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటన

శ్రీనగర్‌లో మరో ఉగ్రదాడిని తిప్పికొట్టిన సైన్యం

జమ్మూ/శ్రీనగర్‌: ఐదుగురు జవాన్లు, ఒక పౌరుడి మృతికి కారణమైన సంజువాన్‌ ఉగ్రదాడికి పాకిస్తాన్‌ తగిన మూల్యం చెల్లించక తప్పదని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. ఆర్మీ శిబిరంపై దాడికి పాల్పడ్డ వారంతా పాకిస్తానీయులేనని, ఆ ఆధారాల్ని పాకిస్తాన్‌కు అందచేస్తామని ఆమె తెలిపారు. సంజువాన్‌ ఆర్మీ శిబిరంపై దాడి అనంతరం అక్కడి పరిస్థితిని సమీక్షించేందుకు సోమవా రం సీతారామన్‌ జమ్మూలో పర్యటించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ దుస్సాహసానికి పాకిస్తాన్‌ తగిన మూల్యం చెల్లిస్తుంది. మన సైనికుల మరణాల్ని వృథాగా పోనివ్వం. ఆర్మీకి ప్రభు త్వం అండగా ఉంటుంది’ అని చెప్పారు. సంజువాన్‌ ఉగ్రదాడి వివరాలు వెల్లడిస్తూ.. ‘మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు హతమవడంతో సోమవారం ఉదయం ఆపరేషన్‌ ముగిసింది. అయితే తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ దాడిలో ఒక పౌరుడు సహా ఆరుగురు మరణించారు. నలుగురు ఉగ్రవాదు లు పాల్గొన్నట్లు వార్తలొచ్చాయి. అయితే నాలుగో ఉగ్రవాది ఆర్మీ శిబిరంలోకి ప్రవేశించలేదు. లోపలికి వెళ్లేందుకు మిగతా వారికి సాయపడివుండవచ్చు’ అని చెప్పారు.  

దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తానీయులేనని.. జైషే మహమ్మద్‌ నేతృత్వంలో వారు పనిచేస్తున్నారని సీతారామన్‌ తెలిపారు. ఉగ్రవాదులకు స్థానికంగా సాయం అందినట్లు ఆధారాలున్నాయని చెప్పారు. ‘ఈ ఉగ్రదాడికి సంబంధించి జైషే ఉగ్రసంస్థ ప్రమేయంపై అన్ని ఆధారాల్ని సేకరించాం. ఎన్‌ఐఏ వాటిని పరిశీలిస్తోంది. తప్పకుండా వాటిని పాకిస్తాన్‌కు అందచేస్తాం. ఎన్నిసార్లు ఆధారాలు సమర్పించినా.. పాకిస్తాన్‌ మాత్రం ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. అయినా ఆధారాలు అందచేయడం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు. అంతకుముందు ఏరియల్‌ సర్వే ద్వారా సంజువాన్‌ ఆర్మీ శిబిరాన్ని ఆమె పరిశీలించారు. ఉగ్రదాడిలో గాయపడి జమ్మూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.  

చర్చలే పరిష్కారం: మెహబూబా ముఫ్తీ
రాష్ట్రంలో కొనసాగుతున్న హింసకు ముగింపు పలికేందుకు భారత్, పాకిస్తాన్‌ తాజాగా చర్చలు జరపాలని జమ్మూ కశ్మీర్‌ సీఎం మెహబూబా ముఫ్తీ కోరారు. పాక్‌తో చర్చలు జరపాలని ఫరూక్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు కోరితే వారిని దేశ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని, ఈ సమస్య పరిష్కారానికి చర్చలే పరిష్కారమన్నారు.

ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు
సంజువాన్‌ ఉగ్రదాడి ఘటన మరువక ముందే.. శ్రీనగర్‌లో సీఆర్‌పీఎఫ్‌ శిబిరంపై ఉగ్రవాదులు దాడికి యత్నించారు. సోమవారం తెల్లవారుజామున శిబిరం వైపు చొచ్చుకొచ్చిన ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. అనంతరం సమీపంలోని ఇంట్లో నక్కిన ఉగ్రవాదుల్ని మట్టుబెట్టేందుకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక సీఆర్‌పీఎఫ్‌ జవాను మృతిచెందారు. సీఆర్‌పీఎఫ్‌ 49వ బెటాలియన్‌కు చెందిన ఆ జవాను తీవ్రంగా గాయపడగా.. కొద్దిసేపటి అనంతరం మరణించాడు.

ఇంట్లో దాగిన ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడం లేదా సజీవంగా పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆపరేషన్‌ కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఎన్‌కౌంటర్‌ జరుగుతున్న ప్రాంతానికి సమీపంలో భద్రతా సిబ్బందిపైకి కొందరు స్థానిక యువకులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే అల్లరిమూకలను ఆర్మీ చెదరగొట్టింది. ‘తెల్లవారుజామున 4.30 గంటలకు ఇద్దరు అనుమానిత వ్యక్తులు బ్యాగులు ధరించి ఆయుధాలతో రావడం కాపలాగా ఉన్న సెంట్రీ గమనించాడు. వెంటనే వారిపైకి కాల్పులు జరిపాడు’ అని సీఆర్‌పీఎఫ్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top