పద్మావత్‌ ఎఫెక్ట్‌ .. మొదలైన విధ్వంసకాండ

Padmaavat Effect Karni Sena vandalized Ahmadebad Theater - Sakshi

గాంధీనగర్‌ : రాజ్‌పుత్‌ కర్ణిసేన అన్నంత పని చేయటం ప్రారంభించింది. గుజరాత్‌లో పద్మావత్‌ చిత్రం ప్రదర్శితం కాబోయే ఓ థియేటర్‌ను ధ్వంసం చేసేసింది. 

శనివారం అర్ధరాత్రి అహ్మదాబాద్‌లోని రాజ్‌హంస్‌ సినిమాస్‌ కాంప్లెక్స్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కర్ణిసేనకు సంబంధించిన కొందరు కార్యకర్తలు ఒక్కసారిగా థియేటర్‌ కాంప్లెక్స్‌లోకి దూసుకొచ్చారు. అద్దాలు ధ్వంసం చేయటంతోపాటు బయట ఉన్న కొన్ని వాహనాలకు నిప్పు పెట్టారు. అడ్డు వచ్చిన సిబ్బందిని కూడా వారు చితకబాదారు. ఈ ఘటనపై యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా జంకుతున్నాడు. మరికొన్నిచోట్ల థియేటర్ల ముందు హెచ్చరికల బోర్డులు కూడా దర్శనమిస్తున్నాయి. సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకుల మీద కూడా దాడులు చేస్తామని అందులో రాసి ఉంది.

కాగా, పద్మావత్‌ ప్రదర్శించించే థియేటర్లను తగలబెడతామని కర్ణిసేన హెచ్చరించిన నేపథ్యంలో థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయించాలని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా దాడి నేపథ్యంలో గుజరాత్‌తోపాటు రాజస్థాన్‌లోనూ థియేటర్ల యాజమానులు పద్మావత్‌ రిలీజ్‌ విషయంలో పునరాలోచనలో చేస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. 

కర్ణిసేనకు భన్సాలీ ఆహ్వానం...

పద్మావత్‌ చిత్రాన్ని వీక్షించేందుకు శ్రీ రాజ్‌పుత్‌ కర్ణిసేనకు దర్శక-నిర్మాత సంజయ్‌ లీలా భన్సాలీ ఆహ్వానం పంపారు. కాగా, ఆ లేఖను కర్ణిసేన చీఫ్‌ లోకేంద్ర సింగ్‌ కల్వి సింగ్‌ తగలబెట్టేశారు. పక్కా కుట్ర తోనే ఈ వ్యవహారమంతా సాగుతోందని, చిత్రాన్ని అడ్డుకునేందుకు చంపడానికైనా.. చావడానికైనా సిద్ధమని ఆయన మరోసారి ఉద్ఘాటించారు.

భన్సాలీ ప్రజెంట్స్‌.. జోకులు... 

పద్మావత్‌ చిత్రంపై వివాదం కొనసాగుతున్న వేళ.. సోషల్‌ మీడియాలో మాత్రం కొందరు తమదైన శైలిలో ఛలోక్తులు విసురుతున్నారు. ముఖ్యంగా భన్సాలీ పేరిట చిత్ర ప్రారంభంలో వేసే విజ్ఞప్తులు(Disclaimers) పేరిట కొన్ని చక్కర్లు కొడుతున్నాయి.

సినిమా చూస్తున్న సమయంలో ఒకవేళ కర్ణిసేన దాడి చేస్తే.. టికెట్‌ డబ్బులు వాపసు చెయ్యం. మీ ప్రాణాలకు మీరే బాధ్యులు.

ఒకవేళ కర్ణిసేన దాడి చేస్తే.. ఎడమ వైపు ద్వారం ద్వారా బయటకు పరిగెత్తండి. ఎందుకంటే కాస్త దూరంలోనే ఆస్పత్రి ఉంది కాబట్టి...

కర్ణిసేన దాడి చెయ్యటంతో మీకు బాగా కోపం వచ్చిందా? అయితే కుడివైపు ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ డొనేషన్‌ బాక్స్‌ ని వాడుకోండి. అది మిమల్ని చల్లబరుస్తుంది. ఇలాంటి సెటైర్లు పేలుతున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top