కేరళకు వరుసకట్టిన మ్యాగీ, బిస్కెట్లు, చాక్లెట్లు

Over Dozen FMCG Companies Donate Food To Kerala: Harsimrat Kaur Badal - Sakshi

న్యూఢిల్లీ : ప్రకృతి విలయతాండవానికి కేరళ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాలకు కనీస అవసరాలు కరువయ్యాయి. వీరిని ఆదుకోవడానికి పెద్ద ఎత్తున్న విరాళాలు తరలివస్తున్నాయి. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కూడా తమ వంతు సహాయ సహకారంగా ఆహారం, మంచినీళ్లు, కనీస వస్తువులను కేరళకు తరలిస్తున్నాయి. ఐటీసీ, కోకా కోలా, పెప్సీ, హిందూస్తాన్‌ యూనిలివర్‌ వంటి 12కు పైగా ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు వచ్చే రెండు రోజుల్లో మరింత ఆహారాన్ని, మంచినీటిని, కనీస వస్తువులను సరఫరా చేస్తామని వాగ్దానం చేసినట్టు కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ చెప్పారు. దిగ్గజ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీల అధికారులతో నిన్న జరిగిన భేటీ అనంతరం, ఈ విషయాన్ని ప్రకటించారు. కేరళకు సహాయం చేసేందుకు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని, ఒక్కొక్కరూ సాయం చేయడం కంటే.. అందరూ కలిసి చేయడం ఎంతో మంచిదని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌కు మంత్రి సూచించారు. 

  • హిదూస్తాన్‌ యూనిలివర్‌ ఇప్పటికే 9500 కేసుల ఉప్పు, 29వేల కేసుల గోధుమలు, 1000 కేసుల కెచప్‌, 250 కేసుల స్పైసస్‌ మిక్స్‌ మసాలా ఇతర ఉత్పత్తులను సరఫరా చేసింది. 
  • నెస్లే ఇండియా 90వేల ప్యాకెట్ల మ్యాగీ, 2 లక్షల ప్యాకెట్ల మచ్‌, 1100 ప్యాకెట్ల కాఫీ, యూహెచ్‌టీ మిల్క్‌ను అందించింది. అదనంగా మరో 40వేల ప్యాకెట్ల మ్యాగీ, లక్షల ప్యాకెట్ల మంచ్‌, 1100 ప్యాకెట్ల కాఫీ, యూహెచ్‌టీలను సరఫరా చేయనున్నట్టు పేర్కొంది. వీటితో పాటు 30వేల ప్యాకెట్ల రెడీ-టూ-డ్రింక్‌ మిలో, 10వేల ప్యాక్‌ల సెరిగోలను సరఫరా చేయనుంది.
  • ఐటీసీ కూడా 3.30 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లను, 2000 బాటిళ్ల సావ్లాన్‌, 3000 ప్యాకెట్ల డైరీ వైటర్న్‌, 9000 ప్యాకెట్ల లిక్విడ్‌ హ్యాండ్‌ వాష్‌, 7000 సోపులను పంపనున్నట్టు తెలిపింది.
  • కోకా కోలా ఇప్పటికే 1.4 లక్షల లీటర్ల మంచినీటిని పంపింది. అదనంగా మరో లక్ష లీటర్ల ప్యాక్‌ చేసిన మంచినీటిని, దానిలోనే 20వేల బాటిళ్లను కేరళకు తరలించనున్నట్టు వెల్లడించింది.
  • పెప్సీకో కూడా 6.78 లక్షల లీటర్ల ప్యాక్‌ చేసిన మంచినీటిని, 10వేల కేజీల క్వాకర్‌ ఓట్స్‌ను సరఫరా చేసింది.
  • బ్రిటానియా కూడా ఇప్పటికే 2.10 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లనును కొచ్చికి అందించింది. 1.25 లక్షల ప్యాకెట్లను మలప్పురం, వయనాడ్‌కు తరలించింది.
  • వచ్చే రెండు రోజుల్లో మరో 1.25 లక్షల ప్యాకెట్ల బిస్కెట్లను కేరళ ప్రజలకు పంపించనున్నట్టు పేర్కొంది. 3000 బన్స్‌, 10000 ప్యాకెట్ల బిస్కెట్లను మధురైకు సరఫరా చేయనున్నట్టు వెల్లడించింది. ఎంటీఆర్‌ ఫుడ్‌ 35వేల ప్యాకెట్ల రెడీ టూ ఈట్‌ను వయనాడ్‌కు పంపించింది. డాబర్‌ కూడా 30 వేల నుంచి 40వేల వరకు టెట్రా-ప్యాక్‌ జ్యూస్‌లను, జీఎస్‌కే ఇండియా రూ.10 లక్షల విలువైన రిలీఫ్‌ మెటీరియల్స్‌ను, 10 లక్షల హార్లిక్స్‌ ప్యాకెట్లను, 10 లక్షల క్రోసిన్‌ టాబ్లెట్లను.. మెరికో 30 టన్నుల ఓట్స్‌ను కేరళ ప్రజలకు పంపించాయి.
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top