ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు

 One Country One Ration Card - Sakshi

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం- ఒక రేషన్ కార్డు విధానాన్ని రూపొందించడానికి 2020 జూన్ 30 వరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమయం ఇచ్చింది. ఇది అమల్లోకి వస్తే లబ్ధిదారులు దేశంలోని ఏ ప్రాంతంలోనైనా రేషన్ షాపుల నుంచి సబ్సిడీతో ఆహార ధాన్యాలను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే 10 రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, త్రిపుర) ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) పోర్టబిలిటీ ద్వారా రేషన్‌ అందిస్తున్నాయని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు.

జూన్ 30, 2020 నాటికి ఒక దేశం- ఒక రేషన్ కార్డు దేశం మొత్తం అమలవుతుందన్నారు. ఈ వ్యవస్థ అమలును వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశామని పాశ్వాన్ విలేకరులతో అన్నారు. వ్యక్తి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస వెళ్లినా పేదలు రేషన్‌ ఎక్కడైనా పొందవచ్చని  కొత్త విధానం తెలియజేస్తోంది. నకిలీ రేషన్‌ కార్డుదారులను కూడా సులభంగా తొలగించడానికి ఈ వ్యవస్థ సహాయపడుతందని తెలిపారు. రేషన్ షాపుల్లో పాయింట్ ఆఫ్ సేల్ (పోస్) యంత్రాలను ఏర్పాటు చేసినందున పీడీఎస్ పోర్టబిలిటీని సులభంగా అమలు చేయగలమని పాశ్వాన్‌ పేర్కొన్నారు.

అక్టోబర్-నవంబర్ నుంచి 15 రాష్ట్రాల్లో ఒక్కో జిల్లాలో పైలట్ ప్రాతిపదికన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా నాణ్యమైన బియ్యం పంపిణీ చేయనున్నట్లు పాశ్వాన్ ప్రకటించారు. అలాగే నిల్వ నష్టాలను తగ్గించడానికి రాష్ట్రాలు తమ ఆహార ధాన్యం డిపోల కార్యకలాపాలను ఆటోమేట్ చేయడానికి ఆరు నెలల గడువు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top