ఇల్లాలు, ప్రియుడిని కట్టిపడేసిన అత్తింటి వారు

Odisha Women Iliega Affair With Boy Friend After Marriage - Sakshi

వివాహేతర సంబంధం గుట్టురట్టు

పెళ్లి ఖర్చులు చెల్లించి.. ప్రియురాలిని సొంతం చేసుకున్న ప్రియుడు

భువనేశ్వర్‌: ఓ ఇల్లాలి వివాహేతర సంబంధం గట్టురట్టయింది. ప్రియుడితో ఉడాయిస్తుండగా పట్టుబడింది. తాళి కట్టిన భర్తను మోసం చేసి ప్రియుడితో పారిపోతుండగా పట్టుబడడంతో మెట్టినింటి గ్రామస్తులు ఆ ఇల్లాలిని అదుపులోకి తీసుకుని తగిన శాస్తి చేశారు. సామాజిక, వైవాహిక విలువల్ని కాలరాసి పారిపోవడం పట్ల గ్రామస్తులంతా ఉమ్మడిగా వ్యతిరేకించారు. ప్రియుడితో చిక్కిన ఇల్లాలిని అదుపులోకి తీసుకుని కాళ్లు, చేతులు కట్టి పడేశారు. ప్రియుడి కుటుంబికుల్ని రప్పించి వ్యవహారం బట్టబయలు చేశారు. ఒడిశాలోని సుందర్‌గడ్‌ జిల్లా రౌర్కెలా బ్రాహ్మణి తరంగ్‌ పోలీసు స్టేషన్‌ పరిధి మండియాకుదర్‌ గ్రామంలో ఈ సంఘటన సోమవారం జరిగింది. జిల్లాలోని లఠికొటా పంచాయతీ ముండాఝొరొ గ్రామస్తురాలితో మండియాకుదర్‌ గ్రామస్తుడికి ఈ ఏడాది మే నెలలో వివాహం జరిగింది. పెళ్లికి ముందు బిర్సా స్టేషన్‌ పరిధిలోని చిరుబెడా గ్రామస్తుడు పురాణ్‌ సింగ్‌తో ఆమెకి  ప్రేమ వ్యవహారం సాగింది.

తాళి కట్టిన భర్తతో కాపురం చేస్తూ ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించడంతో భర్తకు అనుమానం కలగడంతో వారి దాంపత్యంలో అలజడి రేగింది. మెట్టినింటిలో వేధింపులు తాళలేని పరిస్థితి తారసపడడంతో ప్రియుడితో వెళ్లిపోయేందుకు ఆ ఇల్లాలు నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ప్రియుడు పురాణ్‌ సింగ్‌తో ఇల్లాలు లేచిపోతుండగా ఓరాం గ్రామస్తులకు పట్టుబడింది. బస్టాండ్‌లో వారిద్దరినీ గ్రామస్తులు పట్టుకున్నారు. ఆమెను తీసుకుపోతున్న ప్రియుడు పురాణ్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకుని ప్రేమికుల్ని బంధించారు. వారి కాళ్లూచేతులు కట్టి పడేశారు. ప్రియుడు పురాణ్‌ సింగ్‌ కుటుంబీకులకు కబురు చేశారు. ఘటనా స్థలానికి కుటుంబీకులు చేరడంతో గ్రామస్తులంతా కలిసి చర్చించి ఓ  తీర్మానం ఖరారు చేశారు. పెళ్లి ఖర్చుల్ని పరిహారంగా చెల్లించి వివాహితను పురాణ్‌ సింగ్‌తో తీసుకుపొమ్మని తీర్మానించారు. పెళ్లి ఖర్చుల కింద రూ.1 లక్ష 50 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌పట్ల ప్రియుడి కుటుంబీకులు అంగీకరించారు. తక్షణమే రూ.50 వేలు చెల్లించి మిగిలిన సొమ్ము త్వరలో చెల్లిస్తామని అభ్యర్థించడంతో ప్రేమికుల్ని గ్రామస్తులు విడుదల చేశారు.
 
ప్రాణ భయం
ఈ వ్యవహారం అంతటినీ గ్రామస్తులు రికార్డు చేసి సోషల్‌ మీడియాలో ప్రసారం చేశారు. తాళి కట్టిన భర్త కుటుంబీకులకు ఒప్పందం మేరకు పెళ్లి ఖర్చుల బకాయి చెల్లించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో తమకు ప్రాణ భయం ఉందన్న ఆందోళనతో ప్రియుడు, ఇల్లాలు రౌర్కెలా జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ను ఆశ్రయించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top