ఎడమ కాలికి గాయమైతే కుడి కాలుకి చికిత్స..

Odisha Woman Suffered Due To Doctors Negligence   - Sakshi

భువనేశ్వర్‌ : వైద్యుల నిర్లక్ష్యంతో రోగుల పరిస్థితి ప్రాణసంకటంగా మారింది. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ఓ మహిళకు శస్త్ర చికిత్స చేసి ఆమె కడుపులో కత్తెర మరిచిపోయిన ఘటన మరవకముందే.. ఒడిశాలో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత మహిళ ఎడమ కాలికి గాయంతో ఆస్పత్రిని ఆశ్రయిస్తే వైద్యులు ఆమె కుడి కాలికి ఆపరేషన్‌ చేసిన నిర్వాకం వెలుగుచూసింది. కెంజార్‌ జిల్లాలోని కాబిల్‌ గ్రామానికి చెందిన మితారాణి జెనా అనే మహిళ రెండ్రోజుల కిందట తన ఎడమకాలికి గాయం కావడంతో చికిత్స కోసం ఆనంద్‌పూర్‌ సబ్‌డివిజన్‌ ఆస్పత్రిలో చేరారు.

రోగి పరిస్థితిని పరిశీలించిన ఆస్పత్రి వైద్యుడు గాయానికి డ్రెస్సింగ్‌ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఈ క్రమంలో గాయమైన కాలికి కాకుండా వైద్య సిబ్బంది వేరే కాలికి డ్రెస్సింగ్‌ చేశారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో సిబ్బంది తొలుత రోగికి అనస్తీషియా ఇచ్చారు. మరోవైపు తాను స్పృహలోకి వచ్చిన అనంతరం ఎడమ కాలికి బదులు తన కుడి కాలుకు చిక్సిత చేశారని గుర్తించానని వైద్యాధికారికి బాధితురాలు జెనా ఫిర్యాదు చేశారు.

వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో తాను నడవలేకపోతున్నానని ఆమె వాపోయారు.నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్య సిబ్బందిపై చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. ఈ ఘటనపై కెంజార్‌ జిల్లా కలెక్టర్‌ అశీష్‌ థాక్రే విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు చేపడతామని ఆనంద్‌పూర్‌ సబ్‌ డివిజనల్‌ ఆస్పత్రి ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ కృష్ణ చంద్ర దాస్‌ పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top