పోలీస్‌ స్టేషన్‌కూ పులిమారు | Sakshi
Sakshi News home page

పోలీస్‌ స్టేషన్‌కూ పులిమారు

Published Sun, Jan 7 2018 5:40 PM

Now saffron colour decorates Lucknow police station - Sakshi

సాక్షి, లక్నో : యోగి ఆదిత్యానాథ్‌ యూపీ సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ రాష్ర్టం క్రమంగా కాషాయరంగు పులుముకుంటున్నది. ఇటీవల హజ్‌ హౌస్‌ను కాషాయంతో అలంకరించిన పాలకులు తాజాగా రాష్ర్ట రాజధాని లక్నో పోలీస్‌ స్టేషన్‌కూ కాషాయ రంగు పులిమారు. బుక్‌లెట్లు, స్కూల్‌ బ్యాగులు, టవల్స్‌, కుర్చీలకు కాషాయం రంగు పూసిన సర్కార్‌ తాజాగా ఈ లిస్ట్‌లో స్ధానిక ఖైసర్‌ బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌నూ చేర్చింది. 1939లో నిర్మించిన ఈ పోలీస్‌ స్టేషన్‌ ఇప్పటివరకూ సంప్రదాయ పసుపు, ఎరుపు రంగుల్లోనే ఉండేది.

అయితే ఇటీవల భవనంలోని పిల్లర్లు, కొంత భాగానికి కాషాయ రంగు వేశారు. పోలీస్‌ స్టేషన్‌ పునరుద్ధరణలో భాగంగా ఈ రంగులు వేశామని, తీవ్ర చలి కారణంగా వర్కర్లు రాకపోవడంతో ఈ పనులు ఇంకా పూర్తికాలేదని ఇన్‌స్పెక్టర్‌ డీకే ఉపాధ్యాయ చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లో సీఎం కార్యాలయం ఉన్న లాల్‌ బహుదూర్‌ శాస్త్రి భవన్‌కు కాషాయ రంగు వేశారు. యోగి ఆదిత్యానాథ్‌ సీఎం అయ్యాక రాష్ర్ట సచివాలయ ప్రాంగణానికీ కాషాయం కలర్‌ ఇచ్చారు. తన కార్యాలయంలోని తన సీటులో కాషాయ టవల్‌ను యోగి ఇష్టపడతారు. ఇటీవలే ఆయన 50 కాషాయ రంగులతో కూడిన బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.

Advertisement
Advertisement