పరిశ్రమలకు ఊరట, ఉద్యోగులకు షాక్‌

Not compulsory for businesses to pay wages during coronavirus lockdown   - Sakshi

కరోనా కాలంలో జీతాల చెల్లింపు తప్పనిసరి కాదు

గత ఉత్తర్వులను రద్దు చేసిన కేంద్రం  

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా సంక్షోభంతో  కుదేలైన పరిశ్రమలకు కేంద్రం ప్రభుత్వం ఊరటనిచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో  పనిచేయని ఉద్యోగులకు  వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను  రద్దు  చేస్తూ ఆదివారం  హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ఉత్తర్వుల ను జారీ చేసింది. దీని ప్రకారం లాక్‌డౌన్‌ సమయంలో పని చేయని ఉద్యోగులకు కంపెనీలు ఇకపై తప్పనిసరిగా వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదు. కరోనావైరస్ లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలు మూతపడినా,  ఎలాంటి కోతలు లేకుండా  ఉద్యోగులందరికీ వేతనాలు చెల్లించాలంటూ  మార్చి 29 న ఎంహెచ్ఏ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే.
 
కరోనా వైరస్ సంక్షోభాన్ని అడ్డుపెట్టుకుని ఐటీ ఉద్యోగులను తొలగించకుండా, వారి జీతాల్లో కోత విధించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన  ప్రజాప్రయోజన వాజ్యాన్ని సుప్రీంకోర్టు గత వారం తిరస్కరించింది.  అలాగే మార్చి 20 న కార్మిక కార్యదర్శి నోటిఫికేషన్ , మార్చి 29న హోంశాఖ నోటిఫికేషన్ పై  కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్న ఫికస్ పాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై స్పందించిన సుప్రీం ఈ కాలంలో తమ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించలేని సంస్థలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని  ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాజా ఆదేశాలు జారీ అయ్యాయి. (కరోనా : లాక్‌డౌన్‌ సడలింపుల వేళ గుడ్‌ న్యూస్‌!)

కాగా ముదురుతున్న ఆర్థిక సంక్షోభం, ప్రధానంగా దేశస్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)గణనీయంగా క్షీణించనుందనే అంచనాల నేపథ్యంలో ఆర్థిక కార్యకాలాపాల పునరుద్ధరణ నిమిత్తం  అనేక రాష్ట్రాలు కంటైన్‌మెంట్ జోన్లతో పాటు దాదాపు అన్ని ప్రాంతాలలో కీలకమైన ఆర్థిక కార్యకలాపాల ప్రారంభానికి ఆంక్షలను సడలించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top