రైళ్లలో ఫ్లెక్సీ–ఫేర్‌కు సవరణలు

No flexi-fares in 15 trains, lean season relief for 32 more trains - Sakshi

15 రైళ్లలో పూర్తిగా, 32 రైళ్లలో పాక్షికంగా ఎత్తివేత

న్యూఢిల్లీ: ఖరీదైన రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో 2016లో ప్రవేశపెట్టిన ఫ్లెక్సీ–ఫేర్‌ విధానంలో రైల్వే మార్పులు చేయడంతో కొన్ని రైళ్లలో చార్జీలు తగ్గనున్నాయి. ఫ్లెక్సీ–ఫేర్‌ విధానాన్ని 15 రైళ్లలో పూర్తిగా, మరో 32 రైళ్లలో ప్రతి ఏడాదీ ఫిబ్రవరి, మార్చి, ఆగస్ట్‌ నెలల్లో మాత్రమే రైల్వే శాఖ రద్దు చేసింది. ఆ మూడు నెలల్లో ఈ 32 రైళ్లలో రద్దీ తక్కువగా ఉంటున్నందునే ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఫ్లెక్సీ–ఫేర్‌ విధానం అమలయ్యే మిగతా రైళ్లలోనూ గరిష్ట చార్జీని ప్రస్తుతం ఉన్న 1.5 రెట్ల నుంచి 1.4 రెట్లకు తగ్గించింది. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఈ ఫ్లెక్సీ–ఫేర్‌ విధానం కారణంగా ప్రతి పది శాతం సీట్లు బుక్‌ అయ్యే కొద్దీ చార్జీ 10 పెరుగుతూ పోతుంది. అలా సాధారణ చార్జీతో పోలిస్తే గరిష్టంగా 1.5 రెట్ల వరకు చార్జీలను పెంచేవారు.

తాజా నిర్ణయంతో చార్జీలు 1.4 రెట్ల వరకే పెరుగుతాయి. ఫ్లెక్సీ–ఫేర్‌ విధానం వల్ల రైల్వేకు ఆదాయం పెరిగింది కానీ ప్రయాణికుల సంఖ్య మాత్రం భారీగా తగ్గిందనీ ఈ ఏడాది జూలైలోనే రైల్వేపై కాగ్‌ మొట్టికాయలు వేశారు. దీంతో ఫ్లెక్సీ–ఫేర్‌లో తాజా మార్పులు జరిగాయి. ఈ మార్పుల కారణంగా చార్జీలు తగ్గుతున్నాయి కాబట్టి మరింత ఎక్కువ మంది ప్రయాణికులు రైళ్లు ఎక్కడం ద్వారా అధిక ఆదాయాన్ని సాధిస్తామని రైల్వే మంత్రి  గోయల్‌ చెప్పారు. ఫ్లెక్సీ–ఫేర్‌ విధానం పూర్తిగా రద్దయిన వాటిలో చెన్నై–మదురై దురంతో రైలు ఉండగా.. ఫిబ్రవరి, మార్చి, ఆగస్ట్‌ నెలల్లో మాత్రమే ఈ విధానం రద్దయిన రైళ్లలో సికింద్రాబాద్‌–పుణె శతాబ్ది, సికింద్రాబాద్‌–హజ్రత్‌ నిజాముద్దీన్‌ శతాబ్ది, సికింద్రాబాద్‌–ముంబై దురంతో, చెన్నై సెంట్రల్‌–కోయంబత్తూర్‌ శతాబ్ది తదితర రైళ్లున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top