‘శారదా’కు ఉగ్ర లింకు లేదు | Sakshi
Sakshi News home page

‘శారదా’కు ఉగ్ర లింకు లేదు

Published Thu, Dec 4 2014 2:56 AM

No “contradiction” on Amit Shah's claim on Saradha chit fund scam: BJP

 బీజేపీ చీఫ్ అమిత్ షా వాదనతో విభేదించిన కేంద్రం
 న్యూఢిల్లీ: శారదా చిట్ ఫండ్ సొమ్ము బంగ్లాదేశ్‌లోని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారన్న విషయంలో ప్రభుత్వం, బీజేపీ మధ్య భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఆ సొమ్మును బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించారని ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పగా.. ఓ కేంద్ర మంత్రి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు. ‘‘బంగ్లాదేశ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు శారదా చిట్ ఫండ్ సొమ్ము ఉపయోగించినట్లు ఇంతవరకు జరిగిన దర్యాప్తులో ఎలాంటి ఆధారాలూ లభ్యం కాలేదు’’ అని సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభకు లిఖితపూర్వకంగా తెలిపారు.
 
  ఆదివారం కోల్‌కతాలోని ఓ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘అక్టోబర్ 2న బర్ద్వాన్‌లో జరిగిన పేలుడుకు శారదా కుంభకోణం సొమ్మే ఉపయోగించారు. అయితే దాన్ని దర్యాప్తు చేయకుండా ఎన్‌ఐఏను కొందరు అడ్డుకుంటున్నారు. ఆ పేలుడుతో సంబంధమున్న కొందరు టీఎంసీ నాయకులును కాపాడేందుకే ఇలా చేస్తున్నారు’’ అని ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు శారదా స్కాం అంశంపై జితేంద్రసింగ్ ప్రకటనను మీడియా వక్రీకరించిందని ప్రభుత్వ వర్గాలు చెప్పుకొచ్చాయి. శారద స్కాం వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, బంగ్లాదేశ్‌లో ఉగ్ర కార్యకలాపాలకు ఆ సొమ్ము వాడినట్లు ఇప్పటివరకూ ఏమీ బయటపడలేదనే మంత్రి పేర్కొన్నట్లు వివరించాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement