
న్యూఢిల్లీ: బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని ఆశలు పెట్టుకున్న సామాన్యుడికి ఆర్థిక మంత్రి జైట్లీ మొండిచేయి చూపారు. పెట్రోల్, డీజిల్‌పై పన్నులు తగ్గించినట్టే తగ్గించి.. మరో రూపంలో వాతపెట్టారు. దీంతో పెట్రో ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. 2018–19 బడ్జెట్ ప్రతిపాదనల్లో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 2 చొప్పున ఎక్సైజ్ పన్నును తగ్గించారు.
అలాగే ఆ రెండింటిపై రూ.6 చొప్పున అదనపు ఎక్సైజ్ పన్నును తగ్గించడంతో అందరూ సంతోషించారు. మొత్తంగా పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 8 తగ్గించినా.. అంతే మొత్తంలో ‘లెవీ ఆఫ్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్టక్చర్ సెస్’ పేరిట భారీగా వాత పెట్టారు. దీంతో ధరలు మళ్లీ యథాస్థితికి చేరుకున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గురువారం బడ్జెట్ సమర్పణ రోజునే పెట్రోలు ధర గరిష్టంగా రూ. 73కి, డీజిల్ ధర రూ. 64.11కి(ఢిల్లీలో) చేరడం గమనార్హం.