నిర్మలకు కోపమొచ్చింది!

Nirmala Sitharaman snaps at Karnataka minister during press meet - Sakshi

మీడియా సమావేశం త్వరగా ముగించాలని కోరిన కర్ణాటక రాష్ట్ర మంత్రి మహేశ్‌

ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి..

ఆమె బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: మహేశ్‌

సాక్షి బెంగళూరు: కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అవుతున్న కొడగు జిల్లాలను శుక్రవారం రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా నిర్మల కొడగు జిల్లా మంత్రి సా రా మహేశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడగులో ఆర్మీ సహాయక చర్యలను పరిశీలించేందుకు కర్ణాటకకు చేరుకున్న నిర్మలా .. మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో బిజీ షెడ్యూల్‌ దృష్ట్యా సమావేశాన్ని త్వరగా ముగించాలని మహేశ్‌ సీతారామన్‌ను కోరారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఆమె ‘నేను కేంద్ర మంత్రిని. కానీ మీ ఆదేశాలను పాటించాల్సి వస్తోంది.

నమ్మలేకపోతున్నా’ అని అన్నారు. జిల్లా అధికారులు అందించిన ప్రణాళిక మేరకే తాను నడుచుకుంటున్నానని స్పష్టం చేశారు. అనంతరం కొడగు డిప్యూటీ కమిషనర్‌ను శ్రీవిద్యను పిలిపించిన సీతారామన్‌.. షెడ్యూల్‌లో తలెత్తిన సమస్యను సరిచేయాలనీ, మంత్రి మరోసారి తనను ఇబ్బందిపెట్టకుండా చూడాలని ఆదేశించారు. ఓ వ్యక్తి(మహేశ్‌) కారణంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న అందరినీ బాధపెట్టాలనుకోవడంలేదని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఆ గదిలో మీడియా సిబ్బందితో పాటు ఆర్మీ అధికారులు ఉన్నారు.

మహేశ్‌తో సీతారామన్‌ వాగ్వాదం నేపథ్యంలో గట్టిగా మాట్లాడాలని మీడియా ప్రతినిధులు కోరగా.. ‘మైకులు ఆన్‌లోనే ఉన్నాయి కదా. అన్నింటిని రికార్డు చేసుకోవచ్చు. మీకు నచ్చినంతసేపు రికార్డు చేసుకోండి’ అని చెప్పారు. కొడగు జిల్లాకు రక్షణ శాఖ నుంచి తక్షణ సాయంగా రూ.7 కోట్లు, తన ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి మరో రూ.కోటి విడుదల చేస్తున్నట్లు నిర్మల చెప్పారు. అంతకుముందు మడికేరి పునరావాస కేంద్రంలో వరద బాధితుల్ని పరామర్శించిన మంత్రి.. జిల్లాలో నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాగా, సీతారామన్‌ వ్యాఖ్యలపై మహేశ్‌ స్పందిస్తూ..‘ఆమె తమిళనాడులో పుట్టింది. ఆంధ్రుడిని పెళ్లాడి కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైంది. ఇలాంటప్పుడు ఆమె మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండాల్సింది’ అని వ్యాఖ్యానించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top