'అష్ట'లక్ష్మీ గ్రామోస్తుతే

Nirmala Sitharaman is the first woman minister to introduce a full Union budget - Sakshi

పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తొలి మహిళా మంత్రిగా రికార్డులకెక్కిన నిర్మలా సీతారామన్‌.. ఓ మహిళగా, ఓ సాధారణ కుటుంబం వచ్చిన మహిళగా.. కేంద్ర మంత్రిగా ఆలోచించారు. సొంతింటి కలనుంచి..దేశ రక్షణ వరకు తనకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకుని,గావ్‌–గరీబ్‌–కిసాన్‌ నినాదంతో బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు. 

మహిళా సంక్షేమానికి పెద్దపీట
ఒక మహిళగా.. అదీ ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా నిర్మలా సీతారామన్‌కు పేద, మధ్యతరగతి కుటుంబాల్లో మహిళలు పడే ఇబ్బందులు బాగా తెలుసు. అందుకే మహిళా సంక్షేమానికి తాజా బడ్జెట్‌లో సరిపోయేటన్ని నిధులు కేటాయించారు. ఖాతాలో డబ్బుల్లేకుండా మహిళలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో స్వయం సహాయక బృందాల్లో జన్‌ధన్‌ ఖాతాలున్న వారందరికీ.. రూ.5వేల ఓవర్‌ డ్రాఫ్ట్‌ (ఓడీ) ఇస్తామని ప్రకటించారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపుల్లో ఒకరికి ముద్రలోన్‌ కింద లక్ష రూపాయల రుణం ఇస్తామన్నారు.  

ఎల్‌ఈడీతో వెలుగు జిలుగులు 
విద్యుత్‌ డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతుండడంతో దీనిపై వెచ్చిస్తున్న మొత్తాన్ని తగ్గించేందుకు కేంద్రం ఎల్‌ఈడీలను పంపిణీ చేసింది. ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో ఇంటి వెలుగులు పెరగడంతోపాటు కరెంటు బిల్లు తగ్గించేందుకు 143కోట్ల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీచేయనున్నట్లు ఆమె తెలిపారు. దీంతోపాటు సౌరవిద్యుత్‌ వినియోగాన్ని పెంచేందుకు సోలార్‌ స్టవ్‌లు, సోలార్‌ బ్యాటరీలను తక్కువ మొత్తానికి విక్రయించనున్నట్లు వెల్లడించారు.  

ఆయుష్మాన్‌ భవ 
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వైద్య సమస్యలే పతాక శీర్షికల్లో కనబడుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు మందు రాసేందుకు నిర్మల నడుంబిగించారు. పేద, మధ్య తరగతికి ప్రాణవాయువైన ఆయుష్మాన్‌ భారత్‌పై ప్రత్యేక దృష్టిపెడుతూనే.. మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రుల ఆధునీకరణతోపాటు.. వైద్య విద్యను పటిష్టం చేసే దిశగా అడుగులేశారు. గత రెండు బడ్జెట్‌లతో పొలిస్తే.. వైద్య రంగానికి నిధులను గణనీయంగా పెంచారు. దీంతోపాటుగా సాంప్రదాయ వైద్యానికీ సరైన ప్రాధాన్యతనిచ్చారు.  

ప్రపంచస్థాయికి మన విద్య 
వివిధ రంగాల్లో నైపుణ్యత లేమి కారణంగా వస్తున్న సమస్యలకు విద్యారంగంలో ఉన్న అడ్డంకులే కారణమని గుర్తించిన నిర్మలా సీతారామన్‌.. పాఠశాల విద్యనుంచే మార్పులు తప్పవని నిర్ణయించారు. అందుకే పాఠశాల విద్య, ఉన్నత విద్యలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. పరిశోధనలు, కొత్త ఆలోచనలను ప్రోత్సహించేలా.. నైపుణ్యతతో కూడిన విద్యకు ప్రోత్సాహాన్నిందిచేలా కేటాయింపులు చేశారు. క్రీడలకూ సమాన ప్రాధాన్యమిచ్చేలా ఖేలో ఇండియాకు కేటాయింపులు పెంచారు. 

మా‘ఇంటి’ మాలక్ష్మి 
మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు కలే. అలాంటి కలను దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ నెరవేర్చుకునేందుకు మోదీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకానికి నిర్మల మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ పథకం కింద 81 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికి 26 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలినవి కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయనున్నారు. 

దేశ ‘రక్షణ’కు సింహభాగం 
మాజీ రక్షణశాఖ మంత్రిగా ఆ శాఖకు జరగాల్సిన కేటాయింపులపైనా నిర్మల వెనక్కు తగ్గలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో చేసిన రూ.3.18లక్షల కోట్ల కేటాయింపులనే కొనసాగించారు. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో భద్రతను దృష్టిలో పెట్టుకుని అధునాతన యుద్ధ విమానాలు, ఆయుధాలు కొనుగోలుకు భారీ మొత్తాన్నే వినియోగించనున్నారు.   

రైతే రాజుగా నిలిచేలా 
యూపీఏ హయాంలో పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకునేందుకు పడిన కష్టం నిర్మలకు తెలుసు. గత ఐదేళ్లుగా దేశం ఈ పరిస్థితిని అధిగమించి.. ధాన్యాన్ని ఎగుమతి చేసుకునే పరిస్థితికి వెళ్లడం వెనక రైతు సేవ గొప్పదని పార్లమెంటు సాక్షిగా ప్రశంసించారు. అందుకే రైతన్న ఆదాయాన్ని రెట్టింపు చేయడంతోపాటు.. అన్ని రకాలుగా వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు భారీగా వరాలు కురిపించారు.

మహిళనే.. కానీ! 
ఆడవారికి బంగారమంటే ఎంత ఇష్టమో తెలియంది కాదు. నిర్మలకు మహిళగా వారి ఆసక్తులు తెలుసు. కానీ బంగారంపై దిగుమతి సుంకం పెంచడం వెనక కూడా బలమైన కారణమే ఉంది. దిగుమతిపై వెచ్చించే వ్యయం తగ్గి తద్వారా లోటు తగ్గుతుంది. ఈ విషయంలో ఓ మహిళగా కంటే.. మంత్రిగా చేయాల్సింది అదే. సుంకం పెంచడం ద్వారా బంగారం వినియోగం కాస్త తగ్గుతుందని.   

బడ్జెట్‌ కాదు..‘బహీ ఖాతా’
2019–20 బడ్జెట్‌ సమర్పణ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బ్రిటిష్‌ హయాం నుంచి వస్తున్న మరో సంప్రదాయానికి చెల్లుచీటీ పలికారు. సాధారణంగా బడ్జెట్‌ పత్రాలను లెదర్‌ బ్రీఫ్‌కేసులో తీసుకొచ్చి మీడియాకు ఫోజులివ్వడం పరిపాటి. అయితే ఈసారి నిర్మలా సీతారామన్‌ మాత్రం బడ్జెట్‌ పత్రాలను బ్రీఫ్‌కేసుకు బదులుగా ఎర్రటి సిల్క్‌ వస్త్రాన్ని నాలుగువైపులా కుట్టి తయారుచేసిన భారత సంప్రదాయ బహీఖాతా(లెడ్జర్‌)లో పెట్టుకుని పార్లమెంటుకు తీసుకొచ్చారు. ఈ ‘బహీఖాతా’పై భారత ప్రభుత్వ ముద్ర కూడా ఉండటం గమనార్హం. ప్రాచీన కాలంలో వ్యాపారస్తులు తమ పద్దు పుస్తకాలను ఇదేవిధమైన ఓ వస్త్రంలో చుట్టిపెట్టేవారు. దాన్ని బహీఖాతాగా పిలిచేవారు. ఇది కాస్తా కాలక్రమేణా సంప్రదాయంగా మారింది. పద్దుల పుస్తకాలను భద్రపరచడానికి రోమన్లు,గ్రీకులు సైతం ఇదే తరహా పద్ధతిని అనుసరించేవారని కొందరు చరిత్రకారుల అభిప్రాయం.

బహీఖాతా’ అనేది భారతీయ సంప్రదాయం. దాన్నే మేం అనుసరిస్తున్నాం. ఇది పాశ్చాత్య బానిసత్వం నుంచి భారతీయతకు మారుతున్నామని చెప్పడానికి సంకేతం. అందుకే ఇది బడ్జెట్‌ కాదు.. ‘బహీఖాతా(పద్దుల పుస్తకం)  క్రిష్ణమూర్తి సుబ్రహ్మణ్యం చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ 

నేను బడ్జెట్‌ డాక్యుమెంట్లను తీసుకొచ్చేందుకు లెదర్‌బ్యాగ్‌ని ఎందుకు ఉపయోగించలేదంటే, బ్రిటీష్‌ వలసవాదాన్ని వదిలించు కోవడానికే. మన ప్రత్యేకతను చాటడానికి ఇదే సరైన సమయమని భావించా. అలాగే ఇది మోయడం సులువుగా కూడా ఉంటుంది. 
- నిర్మలా సీతారామన్‌ ఆర్థిక మంత్రి 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top