ఉరితో రేప్‌లకు చెక్‌! | Sakshi
Sakshi News home page

నిర్భయ నేరస్థులకు ఉరితో రేప్‌లకు చెక్‌!

Published Sat, Jan 18 2020 2:00 PM

Nirbhaya case:Executions Prevent Rapes In Future - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నిర్భయ అత్యాచారం, హత్య  కేసులో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు భారత రాష్ట్రపతి కూడా తిరస్కరించడంతో నలుగురుకి ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉరిశిక్షను ఖరారు చేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో నేరస్థులకు క్షమాభిక్ష ప్రసాదించాల్సిందిగా నిర్భయ తల్లి ఆశాదేవీని సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ కోరారు. నేరస్థులకు ఉరిశిక్షను అమలు చేయాలంటూ గత ఏడేళ్లుగా అవిశ్రాంతంగా పోరాడుతున ఆశాదేవీ క్షమాభిక్ష ప్రసాదించే ప్రసక్తే లేదు. పైపెచ్చు ఉరిశిక్ష వల్ల తనకు న్యాయం జరిగిందంటూ ఆమె సంతప్తి కూడా వ్యక్తం చేసే అవకాశం ఉంది. రేప్‌లకు ఉరిశిక్షలు అమలు చేయాలంటూ ఆందోళనలు చేస్తున్న సామాజిక కార్యకర్తలంతా స్వీట్లు పంచుకొని ఆనందోత్సవాలు కూడా జరుపుకోవచ్చు. 

అసలు ఉరిశిక్షల వల్ల మహిళలపై అత్యాచారాలు తగ్గుతాయా ? అన్నది ప్రస్తుతం ప్రజాస్వామ్యవాదుల ప్రశ్న. నిర్భయ అత్యాచారం, హత్య సంఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగిన నేపథ్యంలో దారుణమైన అత్యాచార సంఘటనల్లో ఉరిశిక్షలు విధించేందుకు వీలుగా కేంద్రం 2013లో చట్ట సవరణ తీసుకొచ్చింది. ‘నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో’ లెక్కల ప్రకారం 2015 నుంచి 2017 మధ్య దేశంలో 31 శాతం మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. ఎక్కువ కేసుల్లో మహిళలపై అత్యాచారం జరిపి అనంతరం హత్యలు చేశారు. ఇది అంతకుముందు చాలా అరుదుగా జరిగేది. బాధితురాలు బతికుంటే తమకు మరణ శిక్షలు పడే అవకాశం ఉందన్న భావంతోనే ఈ హత్యలు జరిగాయని న్యాయ నిపుణులు విశ్లేషించారు. 

వీటికన్నా అత్యాచార కేసుల్లో సత్వర న్యాయం జరిగితేనే సానుకూల ప్రభావం ఉంటుందని, శిక్షలు కఠినం అవుతున్న కొద్దీ విచారణ ప్రక్రియ చాలా జాప్యం అవుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 2018లో జరిగిన అత్యాచార కేసుల్లో 85 కేసుల్లో చార్జిషీట్లు నమోదు కాగా, వాటిలో శిక్షలు పడేవరకు వెళ్లిన కేసులు కేవలం 27 శాతం మాత్రమే. పైగా అత్యాచార కేసుల్లో నేరస్థులు ఎక్కువగా పరిచయస్థులు, స్నేహితులు లేదా ఇరుగుపొరుగు వారే ఉంటున్నారు. అపరిచితులు తక్కువగా ఉంటున్నారు. పరిచయస్థులు కనక కేసులవుతే మరణ శిక్షలు ఖాయమనుకొని సాక్ష్యాధారాల నిర్మూలనలో భాగంగా మహిళలను ఎక్కువగా హత్య చేస్తున్నారని సామాజిక విశ్లేషకులు తెలిపారు. 

నిర్భయ లాంటి దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు భావోద్వేగాలకు గురై కఠిన చట్టాల కోసం ఆందోళనలకు దిగడం సహజం. ప్రజల భావోద్వేగాలకు అనుకూలంగా న్యాయ నిర్ణేతలు చట్టాలు తీసుకరావడం ప్రమాదకరం. కఠిన చట్టాలే పరిష్కారమైతే నిర్భయ చట్టం తర్వాత హైదరాబాద్‌లో ‘దిశ’ దారుణ అత్యాచార, హత్య సంఘటన జరిగి ఉండేది కాదు. మరణ శిక్ష పడుతుందనే భయాందోళనలతోనే ఆ కేసులో నేరస్థులు దిశను కాల్చివేశారు. 

చదవండి :

దోషులను క్షమించడమా... ప్రసక్తే లేదు!

ఫిబ్రవరి 1 ఉరిశిక్ష అమలు

నిర్భయ దోషుల ఉరి : కొత్త ట్విస్టు

చావును వాడుకోకండి.. నిర్భయ తల్లి కన్నీటి పర్యంతం

Advertisement
Advertisement