
చెన్నై : ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ ప్రభావానికి లోనైన కొంతమంది హిందూ నేతల హత్యకు కుట్రపన్నారన్న సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తమిళనాడులో సోదాలు చేపట్టింది. కోవై, ఇలయంగూడి, ట్రిచి, కయల్పట్టిణం, నాగాపట్టిణం తదితర ఆరు ప్రాంతాల్లో గురువారం సోదాలు నిర్వహించింది. హిందూ మక్కల్ కట్చి నేత అర్జున్ సంపత్, ఆయన కుమారుడు ఓంకార్‌ను హత్య చేయడమే ప్రధాన లక్ష్యంగా కొన్ని ఉగ్రసంస్థలు కుట్ర పన్నాయని ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. వారితో పాటు మరికొంత హిందూ నేతలను కూడా హతమార్చేందుకు పథకం రచించినట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు.
కాగా తమిళనాడుకు చెందిన హిందూ నేతలు సంపత్, హిందూ మున్నై నేత మూకాంబికా మణి, శక్తి సేన నేత అంబు మారిల హత్యకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఎన్‌ఐఏ ప్రత్యేక బృందం ఛేదించిన విషయం తెలిసిందే. ఇక దక్షిణ రాష్ట్రంలో ఐఎస్ ప్రభావిత ఉగ్ర గ్రూపుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. 2014 నుంచి దేశ వ్యాప్తంగా మొత్తం 127 మంది ఐఎస్ సానుభూతి పరులను అరెస్టు చేయగా వారిలో 27 మంది తమిళనాడుకు చెందిన వారే ఉండటం గమనార్హం.