'తదుపరి టార్గెట్ దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్' | next target should be dawood ibrahim and hafiz sayeed, says ramdev baba | Sakshi
Sakshi News home page

'తదుపరి టార్గెట్ దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్'

Oct 6 2016 11:17 AM | Updated on Sep 4 2017 4:25 PM

'తదుపరి టార్గెట్ దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్'

'తదుపరి టార్గెట్ దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్'

భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ అద్భుతమని.. ఇక మనవాళ్ల తదుపరి లక్ష్యం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కావాలని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు.

భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ అద్భుతమని.. ఇక మనవాళ్ల తదుపరి లక్ష్యం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కావాలని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు.  పాకిస్థాన్‌కు మొట్టమొదటిసారిగా చెప్పుదెబ్బ లాంటి సమాధానం చెప్పామని తెలిపారు. పాకిస్థాన్‌తో చర్చించడం అంటే పంది ఎదుట ముత్యాలు చల్లడం లాంటిదని ఘాటుగా విమర్శించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలపై తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు వివరించారు. అసలు సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదన్న పాక్ వాదనను ఖండిస్తూ.. పాకిస్థాన్ ఎప్పుడూ అబద్ధాలకోరేనని అన్నారు. ఉగ్రవాదుల మృతదేహాలను అక్కడినుంచి తరలించి, వేరేచోట ఖననం చేసిన తర్వాత అంతర్జాతీయ మీడియాను అక్కడకు తీసుకెళ్లిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రభుత్వం వద్ద సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన గట్టి ఆధారాలు, వీడియో ఫుటేజి ఉన్నాయని, కానీ దాన్ని బయట పెట్టడం అనేది మన వ్యూహాలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి తప్ప నాయకుల డిమాండ్ల గురించి పట్టించుకోకూడదన్నారు. దాడులే జరగకపోతే... తాము దీటుగా స్పందిస్తామని ఇమ్రాన్ ఖాన్ లాంటి రాజకీయ తాబేదారులు ఎందుకు స్పందిస్తారని ప్రశ్నించారు.

పాకిస్థాన్‌లోని యువతరాన్ని చదివించడానికి భారతీయులంతా కొద్దికొద్దిగా విరాళాలు ఇవ్వాలని, కనీసం వాళ్లకు అక్షరాస్యత వస్తేనైనా ఉగ్రవాద భూతం వాళ్ల బుర్రల్లోంచి వదులుతుందని రాందేవ్ బాబా అన్నారు. పాకిస్థాన్‌లో అలాంటి చొరవ మొదలైతే.. దానికి పతంజలి సంస్థ నాయకత్వం వహిస్తుందన్నారు. భారతీయులు చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని, చైనా నుంచి వెన్నుపోటు తప్ప ఏమీ రాలేదని ఆయన చెప్పారు.

అమెరికా వాళ్లు ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చినట్లుగానే మనవాళ్లు కూడా దావూద్ ఇబ్రహీం, హఫీజ్ సయీద్‌లను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ చేయాలని రాందేవ్ సూచించారు. వాళ్లను సజీవంగా తీసుకురావాల్సిన అవసరం లేదని తెలిపారు. వీళ్లద్దరికీ మోక్షం కల్పించాలని అన్నారు. వాళ్ల చావుతో ప్రపంచం మొత్తానికి శాంతి లభిస్తుందని, ఇలా చేసినందుకు మోదీని కలకాలం గుర్తుంచుకుంటారని తెలిపారు.

కేవలం తమ బూట్లు నాకేవాళ్లు, తమను పొగుడుతూ పాటలు పాడేవాళ్లను మాత్రమే పాకిస్థాన్ స్వాగతిస్తుందని.. వాళ్లు ఇప్పటికే మన సినిమాలను, మన నటులను బహిష్కరించినప్పుడు.. మనం మాత్రం ఎందుకు వాళ్ల నటులు, వాళ్ల సినిమాలను బహిష్కరించకూడదని ప్రశ్నించారు. నటులేమీ ఉగ్రవాదులు కారు కదా అని సల్మాన్ అంటున్నారు గానీ.. అసలు వాళ్లను ఉగ్రవాదులుగా ఎవరు అభివర్ణించారని ప్రశ్నించారు. సల్మాన్ ఖాన్‌కు సరిహద్దు అవతల కూడా మార్కెట్ ఉంది కాబట్టి, దాని గురించి ఆయనకు అంత బాధ ఉంటే పాకిస్థాన్ వెళ్లి అక్కడ భారతీయ సినిమాల మీద నిషేధం ఎత్తేయించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement