అర్నబ్‌ దొరికితే..ఆడుకోరా!

Netizens fires on Republic TV Editor-in-Chief on the Gujarat issue

‘గుజరాత్‌ అల్లర్ల’పై అడ్డంగా బుక్కైన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌ 

చెడుగుడు ఆడేసుకున్న నెటిజన్లు 

అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలి... అనేది సామెత. కానీ అలాకాకుండా అబద్ధం ఆడి అడ్డంగా (ససాక్ష్యంగా) దొరికిపోతే.. ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఊహించండి. తన టీవీ షోలో అందర్నీ ఆడేసుకునే విఖ్యాత జర్నలిస్టు, రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌ అర్నబ్‌ గోస్వామి పరిస్థితి ఇదే! మరి నెటిజన్లు ఊరుకుంటారా? అసలే అవతలున్నది అర్నబ్‌... అంతే రెచ్చిపోయారు. తమలోని సృజనకు సానబెట్టి ఒక ఆట ఆడుకున్నారు.      – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌  

‘వావ్‌... గుజరాత్‌ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రి నివాసానికి సమీపంలో తన కారుపై దాడి జరిగిందని నా మిత్రుడు అర్నబ్‌ చెబుతున్నాడు. నిజమేమిటంటే... అతనసలు అహ్మదాబాద్‌ అల్లర్ల కవరేజీలో పాల్గొననేలేదు’ 
ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఈనెల 19న చేసిన ట్వీట్‌. 
ట్వీట్‌తో పాటు యూట్యూబ్‌లో అర్నబ్‌ ప్రసంగం తాలూకు లింక్‌ను కూడా రాజ్‌దీప్‌ షేర్‌ చేశారు. 

వీడియోలో అర్నబ్‌ ఏమన్నాడంటే... 
‘‘అది 2002. అహ్మదాబాద్‌లో సీఎం నివాసానికి 50 మీటర్ల దూరంలో ఉండగా... చేతుల్లో త్రిశూలాలతో ఒక గుంపు మా అంబాసిడర్‌ కారును చుట్టుముట్టింది. జర్నలిస్టులమని ఎంత చెబుతున్నా.. మతమేమిటని రెట్టించి అడిగారు. అదృష్టవశాత్తు ఆ రోజు మా కారులో మైనారిటీలు ఎవరూ లేరు. మా ఐడీ కార్డులపై పేర్లు చూసి వదిలిపెట్టారు. అయితే కారు డ్రైవర్‌కు ఎలాంటి ఐడీ కార్డు లేదు. భయంతో వణికిపోయాడు. చివరకు చేతిపైనున్న ‘హే రామ్‌’అని రాసున్న పచ్చబొట్టు లాంటి దాన్ని చూపించి బయటపడ్డాడు’’ 

నిజమేమిటంటే ఈ దాడి జరిగింది రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ బృందంపై. అప్పుడు రాజ్‌దీప్, అర్నబ్‌లు ఇద్దరూ ఎన్డీటీవీలో పనిచేసేవారు. గుజరాత్‌ అల్లర్లను కవర్‌ చేసిన బృందంలో తొలుత అర్నబ్‌ లేడు. తర్వాతి దశలో వెళ్లాడు. రాజ్‌దీప్‌తోపాటు నాడు కవరేజీలో పాల్గొన్న తోటి జర్నలిస్టులు కూడా దీన్ని ధ్రువీకరించారు. రిపబ్లిక్‌ టీవీ న్యూస్, స్పెషల్‌ ప్రాజెక్ట్‌ ఎడిటర్‌ ప్రేమా శ్రీదేవి... నాటి కవరేజీలో పాల్గొన్న బృందం గ్రూపు ఫొటోను ట్వీట్‌ చేశారు. దీనిపై మరో సీనియర్‌ జర్నలిస్టు మాయా మీర్‌చందానీ స్పందిస్తూ.. ‘అల్లర్ల తర్వాత వారం రోజులకు తీసిన ఫొటో ఇది. అర్నబ్‌ రెండు రోజుల కోసం ఖేడాకు వెళ్లారు. అప్పటిదీ ఫొటో. కాబట్టి ఈ ఫొటో అర్నబ్‌ అబద్ధాన్ని నిజం చేయలేదు’అని పేర్కొన్నారు. ఏ చిన్న ఆధారం దొరికినా... ఇంతెత్తున లేచే అర్నబ్‌ మాత్రం తన వ్యాఖ్యలపై ఇంత వివాదం జరిగినా ఇప్పటిదాకా స్పందించలేదు. 

‘‘గొప్పలు చెప్పుకోవడానికి కూడా ఓ హద్దుండాలి. నా వృత్తి ఈ స్థితికి వచ్చినందుకు చింతిస్తున్నాను’’అని రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ మరో ట్వీట్‌ చేశారు. అర్నబ్‌ క్షమాపణ చెప్పాలన్నారు. అంతే నెటిజన్లు విరుచుకుపడ్డారు. తమలోని సృజన బయటికి తీస్తూ ప్రముఖుల పాత ఫొటోలను ఫొటోషాప్‌ ద్వారా మార్ఫింగ్‌ చేసి... ‘అర్నబ్‌ డిడ్‌ ఇట్‌’అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీటర్‌లో పోస్ట్‌చేశారు. ఇది బాగా వైరల్‌ అయ్యింది. నెటిజన్లు పెట్టిన కొన్ని పోస్టుల్లో మచ్చుకు కొన్ని... 
- ‘‘ఎవరికీ తెలియని విషయమేమిటంటే.. చంద్రుడిపై తొలుత కాలుమోపిన వ్యక్తి అర్నబ్‌ గోస్వామియే. స్పేస్‌ సూట్లో ఉంది అతనే. కానీ నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ ఆ క్రెడిట్‌ తీసేసుకున్నాడు’’ 
‘‘మహాత్మాగాంధీని అహింసామార్గంలో నడిపిస్తున్న అర్నబ్‌’’’ 
‘‘ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీని పరిశీలిస్తున్న అర్నబ్‌’’ 
- ‘‘ఎడ్వినా మౌంట్‌బాటెన్‌ సిగరెట్‌ను వెలిగిస్తున్న అర్నబ్‌’’ 
‘‘1857లో బీఫ్‌ తినడానికి నిరాకరించి సిఫాయి తిరుగుబాటును లేవదీసిన అర్నబ్‌’’ 
- ‘‘క్విట్‌ ఇండియా పిలుపునకు ముందు గాంధీ కోసం తాను రాసిన ప్రసంగ పాఠాన్ని మహాత్మునికి అందజేస్తున్న బాల అర్నబ్‌’’ 
- ‘‘అర్నబ్‌ కారును అడ్డగిస్తున్న డైనోసార్‌’’ 
‘‘అర్నబ్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు నెహ్రూకు ధన్యవాదాలు తెలుపుతున్న ఐన్‌స్టీన్‌. ఐన్‌స్టీన్‌కు సాపేక్ష సిద్ధాంతాన్ని అర్నబ్‌ బోధించేందుకే ఈ భేటీ.’’ 
- ‘‘జార్జ్‌ ఫోర్‌మన్‌తో తలపడటానికి ముందు మహ్మద్‌ అలీకి శిక్షణ ఇస్తున్న అర్నబ్‌’’ 
‘‘1893లో దక్షిణాఫ్రికాలోని పీటర్‌మార్టిజ్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌లో తెల్లవారి కోసమే ప్రత్యేకించిన ఫస్ట్‌క్లాస్‌ బోగీలో కూర్చున్నందుకు రైలు నుంచి బయటకు తోసివేయబడ్డ అర్నబ్‌’’     

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top