ఒడిశాలో నీట్‌ వాయిదా

NEET Exam Postponed In Odisha Due To Cyclone Fani - Sakshi

భువనేశ్వర్‌: దేశ వ్యాప్తంగా మే 5న నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)ను తుపాను కారణంగా ఒడిశాలో వాయిదా పడింది. ఫొని సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే  పునరావాస చర్యలు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నీట్‌ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ సెక్రటరీ ఆర్‌.సుబ్రహ్మణ్యం శనివారం వెల్లడించారు. మిగతా రాష్ట్రాల్లో షెడ్యూల్ ప్రకారం మే 5న నీట్‌ పరీక్షను జరగనుంది. ఒడిశాలో ఈ పరీక్షను నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో వివిధ వర్సిటీల పరిధిలో జరిగే పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఇదిలా ఉండగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలు సైక్లోన్‌ ఫొని కారణంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న నేపథ్యంలో నీట్‌ను వాయిదా వేయాలంటూ పలవురు కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. దీనిని పరిశీలించిన సంబంధిత శాఖ.. సహాయక చర్యలను, విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను దృష్టిలో ఉంచుకుని పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. భీకర గాలులు, సైక్లోన్‌ ఫొని తూర్పు తీర రాష్ట్రాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. మందుస్తు హెచ్చరికలతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి. 

220కి పైగా రైళ్ల రద్దు
ఒడిశాలో ముందు జాగ్రత్త చర్యగా రైలు, విమాన సర్వీసులను నిలిపివేశారు. కోల్‌కతా–చెన్నై మార్గంలో ప్రయాణించే 220కి పైగా రైళ్లను శనివారం వరకు రద్దు చేసినట్లు ఈస్టుకోస్టు రైల్వే అధికారులు వెల్లడించారు. భువనేశ్వర్, కోల్‌కతా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు రైల్వేశాఖ మూడు ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రధాన స్టేషన్లలోని స్టాళ్లలో ఆహార పదార్థాలు, తాగునీటిని సిద్ధంగా ఉంచినట్లు ప్రకటించింది. మరో మూడు రోజుల వరకు ఉద్యోగులు సెలవులు పెట్టొద్దని కోరింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్, పర్యాటక క్షేత్రం పూరీ రైల్వేస్టేషన్లు తీవ్ర గాలుల ధాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. వివిధ ప్రాంతాల్లో 34 సహాయక బృందాలు పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top