‘అవును... నన్ను పాకిస్తాన్‌కు పంపించింది ఆయనే’

Navjot Singh Sidhu Says His Captain Rahul Gandhi Send Him Anywhere - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సిక్కు యాత్రికుల కోసం నిర్మిస్తున్న కర్తార్‌పూర్‌ కారిడార్‌ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు పాకిస్తాన్‌కు వెళ్లిన నాటి నుంచి పంజాబ్‌ మంత్రి, కాంగ్రెస్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధుపై విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆయన ఖలిస్తాన్‌ వేర్పాటువాద నాయకుడు గోపాల్‌ సింగ్‌ చావ్లాతో ఫొటో దిగడం వివాదానికి దారి తీసింది. ఈ నేపథ్యంలో బీజేపీ, అకాలీదళ్‌ పార్టీ నాయకులు.. ‘సిద్ధు పాకిస్తాన్‌ ఏజెంట్‌’  అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సిద్ధు ప్రవర్తన తీరుపై ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పష్టత ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. (రాహుల్‌ జీ.. స్పష్టత ఇవ్వండి!)

ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై సిద్ధు స్పందించారు. ‘నా కెప్టెన్‌ రాహుల్‌ గాంధీ. ఆయన నన్ను ఎక్కడికి పంపాలని భావిస్తే అక్కడికి పంపిస్తారు. పాకిస్తాన్‌కు కూడా ఆయనే పంపించారు. అయినా నాకు నేనుగా కర్తార్‌పూర్‌ కారిడార్‌ శంకుస్థాపనకు వెళ్లలేదు. 20 మంది సీనియర్‌ నేతలు అక్కడికి వెళ్లాల్సిందిగా నన్ను కోరారు. పార్టీ అధిష్టానం నిర్ణయం కూడా అదే. అందుకే మా ‘కెప్టెన్‌’  (పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ను ఉద్దేశించి)కు నేను కచ్చితంగా పాకిస్తాన్‌ వెళ్తున్నానని చెప్పాను. ఆయనకు కూడా రాహుల్‌జీనే కెప్టెన్‌ కదా. అమరీందర్‌ సింగ్‌ అయితే ఆర్మీ కెప్టెన్‌ మాత్రమే’ అని సిద్ధు వ్యాఖ్యానించారు. కాగా తెలంగాణ ఎన్నికల ప్రచార నిమిత్తం సిద్ధు శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top