భారత్‌లో అత్యంత సంపన్నులు ఏ మతస్తులో తెలుసా?

National Family Health Survey - 4 out, here some key points - Sakshi

జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వేలో ఆసక్తికర వాస్తవాలు

సాక్షి, న్యూఢిల్లీ : ‘దేశంలో ముస్లింల జనాభా పెరిగిపోతున్నద’ని హిందూ అతివాదులు.. ‘మీకు పిల్నల్ని కనడం చేతకావట్లేద’ని ముస్లిం అతివాదులు పరస్పరం విద్వేషాలు రెచ్చగొట్టుకోవడం చూస్తున్నాం. కానీ వాస్తవం ఏంటంటే.. రెండు వర్గాల మహిళల్లోనూ గర్భధారణ(ఫర్టిలిటీ) రేటు గణనీయంగా తగ్గిపోయింది.  తాజాగా విడుదలైన కేంద్ర ఆరోగ్య జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)లో ఇలాంటివే పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

సంతానోత్పత్తి ఇలా.. : గడిచిన పదేళ్లలో హిందూ కుటుంబాల్లో ఫర్టిలిటీ రేటు 2.8 నుంచి 2.1కి పడిపోయింది. అదే ముస్లిం మహిళల్లో 3.4 నుంచి 2.6కు తగ్గింది. అయితే హిందూ-ముస్లిం వర్గాలతో పోల్చుకుంటే జైన, సిక్కు, బౌద్ధ, క్రైస్తవ వర్గాల్లో పిల్లల్నే కనే ప్రక్రియ దారుణంగా మందగించింది. జైనులు కేవలం 1.2 ఫర్టిలిటీ రేటుతో అట్టడుగున నిలిచారు. అదే సిక్కుల్లో 1.6, బౌద్ధుల్లో 1.7, క్రైస్తవుల్లో 2గా నమోదయింది. అల్పాదాయం పొందే పేద వర్గాల్లో సంతానోత్పత్తి రేటు 3.2కాగా, అధిక పొందే(హై ఇన్‌కమ్‌ లెవెల్‌) వర్గాల్లో ఈ రేటు 1.5 మాత్రమే ఉంది. ఇక ఎస్టీల్లో 2.5, ఎస్సీల్లో 2.3, బీసీల్లో 2.2 గా ఉన్న సంతానోత్పత్తి రేటు.. అగ్రకులాల్లో(అప్పర్‌ క్యాస్ట్స్‌లో) మాత్రం 1.9గా ఉంది.

జైనులే అత్యంత సంపన్నులు
జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే 2015-16 ప్రకారం దేశంలో అత్యంత సంపన్న వర్గం జైనులదే.
జైనుల్లో 70.6శాతం మంది అత్యధిక ఆదాయాన్ని పొందుతూ సంపన్నులుగా ఉన్నారు.
జైనుల్లో 7.9శాతం మంది మాత్రమే ఆల్పాదాయవర్గంలో ఉన్నారు.
జైనుల తర్వాత సంపన్నవర్గంగా సిక్కులు ఉన్నారు.
సిక్కుల్లో 59.6 శాతం మంది సంపన్నులేకాగా, అల్పాదాయాన్ని పొందేవారు 5.2 మంది మాత్రమే ఉన్నారు.
ఇక దేశంలో మెజారిటీ వర్గమైన హిందువుల్లో 40.2 మంది అల్పాదాయ పరిధిలో ఉన్నారు.
హిందువుల్లో సంపన్నుల శాతం19.3కాగా,  మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతిలో 39.6 శాతం మంది ఉన్నారు.
ముస్లింలలో 39.5 శాతం మంది చాలా తక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు.
ముస్లింలలో సంపన్నుల శాతం 18.2గా, మధ్యతరగతి, ఎగువ తరగతి వారి శాతం 42.3గా ఉంది.
క్రైస్తవుల్లో 29.1 శాతం మంది సంపన్నులు, 26.6 శాతం మంది పేదలు ఉన్నారు.
బౌద్ధుల్లో 20.4 శాతం మంది సంపన్నులుగానూ, 49.6శాతం మంది మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గంగానూ, 30.2 శాతం మంది అల్పదాయ వర్గంగానూ కొనసాగుతున్నారు.

సంపన్న రాష్ట్రాలు ఢిల్లీ, పంజాబ్‌
ఎన్‌ఎఫ్‌హెచ్‌ సర్వే ప్రకారం దేశం మొత్తంలో ఢిల్లీ, పంజాబ్‌లు సంపన్న రాష్ట్రాలుగా నిలిచాయి. అందుబాటులో స్వచ్ఛమైన తాగునీరు, సౌకర్యవంతమైన ఇళ్లు, టెలివిజన్‌ వంటి గృహోపకరణాలు, రవాణా.. తదితర సౌకర్యాల ప్రాతిపదికన సంపన్న రాష్ట్రాల జాబితాలో ఢిల్లీ- పంజాబ్‌లు తొలి స్థానాన్ని దక్కించుకున్నాయి. పేద రాష్ట్రంగా బిహార్‌ చివరి స్థానంలో ఉంది.

సర్వే చేసింది ఎవరు? : అమెరికా కేంద్రంగా పనిచేసే ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పాపులేషన్‌ సైన్సెస్‌(ఐఐపీఎస్‌) ఆధ్వర్యంలో, భారత ప్రభుత్వ సహకారంతో 1992 నుంచి ‘కేంద్ర ఆరోగ్య జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌)’ను నిర్వహిస్తున్నారు. ఇటీవల వెల్లడించిన (2015-16) సర్వే.. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ చేపట్టినవాటిలో నాలుగోది. 1992-93లో మొదటిసారి, 1998-99లో రెండో, 2005-6లో మూడో, 2015-16లో నాలుగో సర్వేను నిర్వహించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top