ఆ కుర్చీలు ఎవరికి!?

Narendra Modi-Xi Jinping contest for chairs - Sakshi

మోదీ, జిన్‌పింగ్‌ కూర్చున్న కుర్చీల కోసం పోటీ

సాక్షి ప్రతినిధి, చెన్నై:  అనధికార భేటీ సందర్భంగా శుక్రవారం మహాబలిపురంలో పాండవ రథాల ప్రాంగణంలో ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ కూర్చుని కొబ్బరి బోండాలు తాగుతూ సేద తీరిన విషయం గుర్తుంది కదా! వారిద్దరూ కూర్చున్న ఆ కుర్చీలకు ఇప్పుడు భారీ డిమాండ్‌ వచ్చింది. ఆ ఇరువురు దేశాధినేతలు అక్కడ కాసేపు కూర్చోవాలనేది అకస్మాత్తుగా, ఆ కార్యక్రమానికి రెండు గంటల ముందు తీసుకున్న నిర్ణయం. దాంతో అప్పటికప్పుడు రాష్ట్ర ప్రజా పనుల శాఖ అధికారులు గిండిలోని ఫర్నిచర్‌ షోరూం వారిని సంప్రదించి ఇద్దరు అగ్రనేతలు వసతిగా కూర్చునేందుకు రెండు టేకు కుర్చీలు, ఒక టీపాయ్, అనువాదకులు కూర్చునేందుకు మరో రెండు కుర్చీలను హుటాహుటిన తెప్పించారు. వాటికి డబ్బులను కూడా తరువాత ఇస్తామని ఆ షోరూం ఓనర్‌కు చెప్పారు. ఇప్పుడు అగ్రనేతలు కూర్చున్న ఆ రెండు కుర్చీల కోసం రాష్ట్ర ప్రజా పనుల శాఖ, కేంద్ర ప్రభుత్వ అధికారులు పోటీ పడుతున్నారు. అగ్రనేతల పర్యటనకు గుర్తుగా వాటిని తమ వద్దే ఉంచుకోవాలని ప్రజాపనుల శాఖ భావిస్తుండ గా,  చరిత్రాత్మక భేటీ స్కృతిచిహ్నంగా ఆ ఫర్నిచర్‌ను తమకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు. మరోవైపు, ‘ఆ ఫర్నిచర్‌కు డబ్బులు వద్దు.. నాకే తిరిగివ్వండి.. నా దగ్గరే గుర్తుగా పెట్టుకుంటా’ అని ఫర్నిచర్‌ షోరూం ఓనర్‌ కోరుతున్నారట. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top