మోడీ నిఘా.. మంత్రులకు వణుకు | Narendra Modi watching his aides for corruption | Sakshi
Sakshi News home page

మోడీ నిఘా.. మంత్రులకు వణుకు

Aug 23 2014 3:25 PM | Updated on Sep 22 2018 8:22 PM

మోడీ నిఘా.. మంత్రులకు వణుకు - Sakshi

మోడీ నిఘా.. మంత్రులకు వణుకు

అవును.. మోడీ చూస్తున్నారు. ఎవరినో కాదు, తన సొంత మంత్రివర్గంలోని సహచరులను, సీనియర్ అధికారులను కూడా ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నారు.

అవును.. మోడీ చూస్తున్నారు. ఎవరినో కాదు, తన సొంత మంత్రివర్గంలోని సహచరులను, సీనియర్ అధికారులను కూడా ఆయన జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ముందే స్పష్టం చేసిన మోడీ.. అందుకు తగ్గట్లే పటిష్ఠమైన చర్యలు చేపడుతున్నారు. ఆగస్టు 12వ తేదీన నిర్వహించిన కార్గిల్ ర్యాలీలో ఆయన ముందుగానే బహిరంగంగా ఓ మాట చెప్పారు. 'నేను తినను, ఎవరినీ తిననివ్వను' అన్నారు. తన మంత్రులైనా, ఉన్నత స్థాయిలో ఉన్నత అధికారులైనా ఎవరైనా సరే.. పాలనలో అవినీతికి పాల్పడితే ఏమాత్రం సహించబోనని చెప్పేశారు. ఇందుకోసం పలు రకాల చర్యలు కూడా తీసుకున్నారు.

ఇప్పటివరకు ఏ ప్రధానమంత్రీ చేయని విధంగా ప్రధానమైన మంత్రిత్వశాఖల కార్యాలయాలు అన్నింటిలో సీసీటీవీలు ఏర్పాటుచేశారు. పెట్రోలియం సహజవాయువుల మంత్రిత్వశాఖ కార్యాలయంలో మొట్టమొదటి సీసీటీవీ కెమెరా వస్తోంది. వందల కోట్లలో ఇక్కడ కాంట్రాక్టులు కుదురుతుంటాయి. అవినీతికి కూడా అంతేస్థాయిలో ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు రక్షణ మంత్రిత్వశాఖలోనూ ఈ కెమెరా కన్ను పనిచేస్తుంది.

గత పదేళ్లలో సమాచార ప్రసార మంత్రిత్వశాఖ వివిధ వార్తాపత్రికలకు జారీచేసిన ప్రకటనలన్నింటినీ కూడా ప్రధానమంత్రి స్వయంగా పరిశీలించబోతున్నారు. ఇలా గత దశాబ్ద కాలంలో ఎంత సొమ్ము పత్రికా ప్రకటనలకు వెచ్చించారో ప్రధాని స్వయంగా చూసి నిగ్గు తేలుస్తారు. భవిష్యత్తులో కూడా ఆయన దృష్టికి వెళ్లాకే ప్రకటనలు ఇవ్వాలి. కొన్ని పెద్ద పత్రికలకు ఇది ఎదురుదెబ్బే అవుతుంది. ప్రభుత్వ ప్రకటనలను నియంత్రిస్తే కొన్ని పెద్ద పత్రికల మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది.

మంత్రులపై ప్రధాని నిఘాకు ప్రత్యక్ష ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఓ మంత్రిగారు ఇటీవల ఓ ఫైవ్ స్టార్ హోటల్లో, ప్రధాని మోడీకి సన్నిహితుడైన ఓ అగ్రస్థాయి పారిశ్రామికవేత్తతో కలిసి భోజనం చేస్తున్నారు. భోజనం సగంలో ఉండగానే మోడీ నుంచి ఫోన్ వచ్చింది.. 'భోజనం అయిపోయిందా' అని ఆయన అడిగారు. కొన్ని నెలల క్రితం మరో మంత్రిగారు తన తొలి విదేశీ పర్యటన కోసం జీన్స్ ప్యాంట్ వేసుకుని విమానాశ్రయానికి వెళ్తున్నారు. సగం దారిలో ఉన్నారో లేదో.. ప్రధాని నుంచి ఫోన్! మంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లడానికి ముందు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని సుతిమెత్తగా ఆయన్ను హెచ్చరించారు. అంతేకాదు.. దేశానికి ప్రాతినిధ్యం వహించే మంత్రిగా ఉన్నప్పుడు జీన్స్ ప్యాంట్లు వేసుకెళ్తే బాగోదని కూడా చెప్పారు. వెంటనే మంత్రిగారు కారు వెనక్కి తిప్పించి, ఇంటికి వెళ్లి కుర్తా పైజమా వేసుకుని అప్పుడు విమానాశ్రయానికి వెళ్లారు.

ఈ నిఘా భయంతో చాలామంది మంత్రులు, ఉన్నతాధికారులు తమ ప్రైవేటు సంభాషణలకు తమ సొంత మొబైల్ ఫోన్లు ఉపయోగించడం దాదాపు మానేశారు. దానికి బదులుగా తమ డ్రైవర్లు, ఇతర సహాయకుల ఫోన్లు తీసుకుని వాటినుంచి చేసుకోవడమే 'సురక్షితం' అని వాళ్లు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement