కుటుంబ నియంత్రణే నిజమైన దేశభక్తి: మోదీ

Narendra Modi Messsage On 73rd Independence Day - Sakshi

న్యూఢిల్లీ: భారతదేశ జనాభా పెరుగుదల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా పెరుగుదల వల్ల పథకాల రూపకల్పనలో ప్రభుత్వాలకు అతి పెద్ద సవాల్‌గా మారబోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు తరాలకు అభివృద్ది ఫలాలను సమృద్దిగా అందించాలంటే జనాభా నియంత్రణ ఎంతో కీలకమని ఆయన తెలిపారు.  భారత ప్రజలకు 73వస్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మోదీ.. రెడ్‌ఫోర్ట్‌ వేదికగా పలు కీలక అంశాల పట్ల తన భావాలను వ్యక్త పరిచారు. ప్రజలకు జనాభా నియంత్రణ పట్ల అవగాహన కల్పించాలని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. కొన్ని వర్గాల ప్రజలు తమ సంతానానికి కావాల్సిన అవసరాల గురించి ఆలోచించకుండానే  బిడ్డలకు జన్మనిస్తున్నారని  మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు జనాభాను నియంత్రిస్తే నిజమైన దేశ భక్తి గల ‍వారవుతారని అన్నారు. సమాజంలో తగిన గుర్తింపు, వారి అవసరాలు తీర్చినప్పుడే సంతానం గురించి ఆలోచించాలని  హితవు పలికారు. 21శతాబ్దంలో దేశం అభివృద్ది చెందాలంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం అని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా నియంత్రణకు అనేక పథకాలు రూపొందించాలని ఆయన సూచించారు. 

ప్రభుత్వాలు ఎన్ని ప్రణాళికలు వేసినా ప్రజలు  సహరించకపోతే అనుకున్న ఫలితాలు సాధించలేమని ఆయన పేర్కొన్నారు. 1.3 బిలియన్లతో చైనాకు  దీటుగా భారత్‌లో జనాభా  పెరుగుదల జరుగుతుందని  అన్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే జనాభాను నియంత్రించడానికి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే పోటీకి అనర్హులుగా ప్రకటించారని తెలిపారు. మోదీ దేశ ప్రజలకు నీటి ప్రాముఖ్యతను తెలియజేశారు. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి కుటుంబానికి నీటిని అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన అన్నారు. ఈ పథకానికి 3.5లక్షల కోట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. కానీ, 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ తరుణంలో కూడా కొందరికి నీటిని అందించలేకపోతున్నామని  మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top