దేశమంతా ఒకసారే ఓట్ల పండగ | Sakshi
Sakshi News home page

దేశమంతా ఒకసారే ఓట్ల పండగ

Published Mon, Apr 24 2017 1:33 AM

దేశమంతా ఒకసారే ఓట్ల పండగ - Sakshi

లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలపై చర్చ కొనసాగాలి
♦ నవ భారత నిర్మాణం కోసం టీమిండియాగా ముందుకెళ్దాం
♦ జీఎస్టీపై ఏకాభిప్రాయం సహకార సమాఖ్య స్ఫూర్తికి తార్కాణం
♦ నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో మోదీ


న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రాష్ట్రాల అసెంబ్లీలు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనపై నిర్మాణాత్మకచర్చ ప్రారంభమైందని.. ఈ చర్చను కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు. ఆర్థిక సంవత్సరాన్ని ప్రస్తుతమున్న ఏప్రిల్‌–మార్చ్‌ నుంచి జనవరి–డిసెంబర్‌కు మార్చే అంశంపైనా చర్చ జరగాలన్నారు. రాష్ట్రాలు ఈ దిశగా చొరవతీసుకోవాలని ప్రధాని కోరారు.

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం జరిగిన నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మూడో సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ.. ఆర్థిక, రాజకీయ వ్యవహారాలను సరిగా నిర్వహించకపోవటం వల్లే దేశం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ‘సరైన సమయపాలన లేని కారణంగా ఎన్నో గొప్ప పథకాలు, నిర్ణయాలు.. అనుకున్న ఫలితాలనివ్వకుండా వ్యర్థమయ్యాయి. మంచి ఫలితాలు రావాలంటే దృఢచిత్తంతో నిర్ణయాలు తీసుకోవటాన్ని అలవర్చుకోవాలి’ అని తెలిపారు.

నవభారత నిర్మాణంలో కేంద్ర, రాష్ట్రాలు కలసి టీమిండియా స్ఫూర్తితో ముందుకెళదామని పిలుపునిచ్చారు. ‘ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా దేశాన్ని పరివర్తనం చేసేందుకు జరుగుతున్న చర్చలో టీమిండియా ఇక్కడ సమావేశమైంది. మనం కోరుకుంటున్న నవభారత (2022–దేశ స్వాతంత్య్రానికి 75 ఏళ్లు పూర్తవుతాయి) నిర్మాణం లక్ష్యాలను చేరుకోవటం మనందరి సంయుక్త బాధ్యత. లక్ష్యాల సాధనలో క్రియాశీలMంగా పనిచేద్దాం’ అని స్పష్టం చేశారు. నీతి ఆయోగ్‌ చర్చిస్తున్న దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక కార్యాచరణ వల్ల రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు.

వ్యవసాయాధారంగా ‘బడ్జెట్‌’ మార్పు
బడ్జెట్‌ తేదీల మార్పు గురించి స్పందిస్తూ.. దేశంలో వ్యవసాయ ఆదాయం కీలకమైన మన దేశంలో.. దీనికి అనుగుణంగానే బడ్జెట్‌ రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు ప్రధాని తెలిపారు. ‘రైతులను, వ్యవసాయాన్ని దృష్టిలో ఉంచుకునే జనవరి–డిసెంబర్‌ ఆర్థిక సంవత్సరంపైనా ఆలోచన చేయాలి’ అని మోదీ సీఎంలను కోరారు.

15 ఏళ్ల దీర్ఘకాళిక ప్రణాళిక, ఏడేళ్ల మధ్యకాలిక వ్యూహం, మూడేళ్ల స్వల్పకాలిక కార్యాచరణ అజెండాగా నీతి ఆయోగ్‌ రోడ్‌ మ్యాప్‌ను సిద్ధం చేస్తుందన్నారు.ఈ సమావేశంలో మూడేళ్ల ప్రణాళిక ముసాయిదా కాపీలను సీఎంలకు అందించారు. వీటిపై రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకున్నాక తుది ప్రణాళికను ఖరారు చేయనున్నట్లు ప్రధాని వెల్లడించారు. బడ్జెట్, ప్రణాళికల ఆమోదానికి రాష్ట్రాలు నీతి ఆయోగ్‌కు రావాల్సిన పనిలేదని ఈ సంస్థ ప్రభుత్వ సమాచారంపై ఆధారపడకుండా నిపుణులతో బృందాన్ని ఏర్పాటు చేసుకుందన్నారు.

పలువురు సీఎంలు లేవనెత్తిన ప్రాంతీయ అసమానతలపై జాతీయస్థాయిలో చర్చ జరగాలని తెలిపారు. మౌలికవసతుల లేమి కారణంగానే దేశం వెనుకబాటుకు గురైందని.. రోడ్లు, పోర్టులు, విద్యుత్, రైళ్లు వంటి వాటిపై మూలధన వ్యయాన్ని వేగవంతం చేయటం ద్వారా పురోగతి సాధ్యమవుతుందన్నారు. ఈ భేటీలో 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్, మేఘాలయా, ఢిల్లీ రాష్ట్రాల సీఎంలు మమత బెనర్జీ, ముకుల్‌ సంగ్మా, కేజ్రీవాల్‌ ఈ సమావేశానికి రాలేకపోయినా.. ప్రతినిధులను పంపించారు.

విభేదాలు పక్కనపెట్టి ఏకమైన సీఎంలు
రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయంతోనే కొత్త పరోక్ష పన్నుల విధానం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)పై ముందడుగు పడిందన్న మోదీ.. సహకార సమాఖ్య వ్యవస్థకు ఇదో గొప్ప ఉదాహరణ అని ప్రశంసించారు. ‘జీఎస్టీ ఒకే దేశం, ఒకే ఆశ, ఒకే సంకల్పం అనే స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. రాష్ట్రాలకు మేలు చేస్తుంది. దీనిపై ఏకాభిప్రాయం రావటం చరిత్రాత్మకం.

రాజకీయ, సిద్ధాంతపరమైన విభేదాలను పక్కనపెట్టి దేశం కోసం అందరు సీఎంలు ఏకతాటిపైకి రావటం గొప్ప పరిణామం’ అని ప్రధాని తెలిపారు. ప్రభుత్వ ఈ–మార్కెట్‌ప్లేస్‌ పోర్టల్‌ను వినియోగించటం ద్వారా అవినీతిని అరికట్టవచ్చని, ప్రభుత్వ సేకరణలో పారదర్శకత పెరుగుతుందన్నారు. భీమ్, ఆధార్‌ సాంకేతికతల ద్వారా రాష్ట్రాలకు భారీగా లాభం చేకూరుతుందని మోదీ తెలిపారు. జీఎస్టీని జూలై 1నుంచి అమలుచేయాల్సి ఉన్నందున.. రాష్ట్రాలు వేగంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

300 పాయింట్లతో ప్రణాళిక
దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించి 300 ప్రత్యేకమైన పాయింట్లపై నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చ జరిగింది. నీతి ఆయోగ్‌ వైస్‌  చైర్మన్‌ అరవింద్‌ పనగారియా ఈ పాయింట్లపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఇందులో వచ్చే 15 ఏళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక, ఏడేళ్ల వ్యూహం, మూడేళ్ల కార్యాచరణ ప్రణాళికపై చర్చ జరిగినట్లు నీతి ఆయోగ్‌ అధికారిక ప్రకటనలో తెలిపింది. విద్య, వైద్యం, మౌలికవసతుల రంగాల్లో మార్పులపైనే ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.రాష్ట్రాలు ఇచ్చిన ఇన్‌పుట్స్‌ ఆధారంగా రూపొందించిన ఈ ప్రణాళికలకు సంబంధించి ముసాయిదా రూపొందించారు. కేంద్రం, రాష్ట్రాల ఆర్థిక అంచనాలకు స్థిరత్వం ఇచ్చేలా వీటిని రూపొందించారు.

ఈ విజన్‌ను ముందుకు తీసుకెళ్లటంలో రాష్ట్రాలు సూచనలు చేయాలని పనగారియా కోరారు. వచ్చే 15 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ మూడురెట్లు అభివృద్ధి చెందుతుందని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగారియా తెలిపారు.2030 కల్లా మన జీడీపీ 7.25 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందన్నారు.  ఈ సందర్భంగా నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ మాట్లాడుతూ.. వ్యవసాయం, పేదరిక నిర్మూలన, వైద్యం, విద్య, డిజిటల్‌ చెల్లింపులు, కోస్తా–ద్వీపాల అభివృద్ధి, పెట్టుబడుల ఉపసంహరణ తదితర అంశాలపైనా ప్రణాళికల్లో పేర్కొన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, స్వచ్ఛ్‌ భారత్, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్‌ చెల్లింపుల అంశాలపై ముఖ్యమంత్రుల సబ్‌కమిటీలు చేసిన పనిని ఆయన ప్రశంసించారు.

వెనుకబడిన జిల్లాలు, ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాల జీఎస్టీ చట్టాన్ని త్వరగా ఆమోదించి పంపించాలని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్‌ అధియా.. సీఎంలను కోరారు. నీటిపారుదల, సాంకేతికత విస్తరణ, మార్కెట్‌ సంస్కరణలు, ఈ–నామ్, పశువుల ఉత్పత్తి పెంపు వంటి అంశాలపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సమావేశంలో మాట్లాడారు. రైతుల ఆదాయం రెట్టింపుచేయటంలో తీసుకోవాల్సిన చర్యలపై నీతి ఆయోగ్‌ సభ్యుడు (వ్యవసాయం) రమేశ్‌ చంద్‌ వివరించారు.

అందరూ సుముఖంగానే!
సాక్షి, న్యూఢిల్లీ: ఒకేసారి పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు జరపటంపై ఆసక్తితో ఉన్న ప్రధా ని.. ఆదివారం నీతి ఆయోగ్‌ సమావేశంలోనూ ఈ అంశాన్ని లేవనెత్తారు. భోజన విరామంలో నూ పలువురు సీఎంల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించి వారి స్పందన తెలుసుకున్నట్టు తెలిసింది. ఈ అంశంపై ఎవరి నుంచి వ్యతిరేకత రాలేదని, అందరూ సానుకూలంగానే ఉన్నారని సమాచారం. అయితే కొన్ని రాష్ట్రాలకు ఇటీవలే ఎన్నికలు జరగడం, మరికొన్ని రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు జరగనుండడంతో ఈ అంశంపై అన్ని పార్టీల ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఎక్కువ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండడంతో దీనిపై సానుకూలత రావొచ్చని భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement