అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్‌

Modi Govt To Give Reservation To Economically Backward Upper Castes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు సోమవారం కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. అగ్రవర్ణాల్లో రూ 8 లక్షల వార్షికాదాయం మించని వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్ర కేబినెట్‌ పేర్కొంది.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా,ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు మోదీ సర్కార్‌ రాజ్యాంగ సవరణను చేపట్టనుంది.అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్‌ కల్పించేలా మంగళవారం ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 16, 17లకు సవరణను ప్రతిపాదించనుంది.ఇక కేబినెట్‌ నిర్ణయంతో జనరల్‌ కేటగిరిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్‌ ఫలాలు తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. కాగా మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

అగ్రవర్ణాల్లో తమ పట్టును మరింత పెంపొందించుకునేందుకు మోదీ సర్కార్‌ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. రాంవిలాస్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్జేపీ, రాందాస్‌ అథవలే నేతృత్వంలోని ఆర్పీఐ వంటి పలు ఎన్డీఏ మిత్రపక్షాలు అగ్రవర్ణాల పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని గతంలోనూ డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీం కోర్టు పరిమితి విధించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top