‘ముస్లింల గురించి మాట్లాడకపోవడమే మంచిది’ | Sakshi
Sakshi News home page

‘ముస్లింల గురించి మాట్లాడకపోవడమే మంచిది’

Published Thu, Jul 12 2018 1:05 PM

Minority Intellectuals Suggests Rahul Gandhi Address Bigger Issues Rather Talking About Muslims - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ముస్లిం కమ్యూనిటీ గురించి తరచుగా మాట్లాడకపోవడమే మంచిదని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ముస్లిం పెద్దలు సూచించారు. జాతీయ మీడియా కథనం ప్రకారం... ముస్లిం వర్గానికి చెందిన పలువురు మేధావులతో రాహుల్‌ గాంధీ బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై రెండు గంటల పాటు చర్చలు జరిపారు. తరచుగా ఆలయాలను సందర్శించడం గురించి ప్రశ్నించగా.. తాను ఆలయాలతో పాటు, మసీదులు, చర్చిలు కూడా సందర్శిస్తున్నానని రాహుల్‌ సమాధానం ఇచ్చారు. అయితే మీడియా కేవలం ఆలయ సందర్శనలకు సంబంధించిన వార్తలను మాత్రమే ప్రముఖంగా ప్రచారం చేస్తోందని రాహుల్‌ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

అన్ని వర్గాలకు లబ్ది చేకూరేలా...
ఈ సమావేశంలో చరిత్రకారుడు సయీద్‌ ఇర్ఫాన్‌ హబీబ్‌, విద్యావేత్త అబూసలే షరీఫ్‌, రచయిత ఫరా నఖ్వీ, మాజీ ఐఏఎస్‌ అధికారి ఎం ఎఫ్‌ ఫారూఖీతో పాటు  ఏఐసీసీ మైనార్టీ చీఫ్‌ నదీమ్‌ జావేద్‌, కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ ఖుర్షీద్‌ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఇర్ఫాన్‌ హబీబ్‌ మాట్లాడుతూ... ‘ముస్లిం కమ్యూనిటి గురించి రాహుల్‌ గాంధీ తరచుగా మాట్లాడుతూ ఉండటం వల్ల ప్రత్యర్థులు ఆయనను ఒక వర్గానికి సానుభూతిపరునిగా చిత్రీకరించేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతోంది. మా గురించి మాట్లాడే కంటే పేదరికం, విద్య ఇలా ఇతర అంశాల గురించి మాట్లాడాల్సిందిగా సూచించాం. అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారించి పార్టీని బలోపేతం చేయడం ద్వారా అన్ని వర్గాలకు లబ్ది చేకూరుతుందని రాహుల్‌కు చెప్పామని’  వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement