లోక్‌సభ వాయిదాలను వివరించే..సన్సద్‌ వాచ్‌

Meghnad Sansad Analysis On Parliamentary Session - Sakshi

పార్లమెంట్‌ సమావేశాల తీరుతెన్నులను అందరికీ  సులభంగా అర్థమయ్యేలా తెలియజేసేందుకు ‘సన్సద్‌ వాచ్‌’ను ఓ సాధనంగా పబ్లిక్‌ పాలసీ నిపుణుడు మేఘ్‌నాథ్‌ ఎంచుకున్నారు. ఇందుకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు యూట్యూబ్‌ను కూడా ఉపయోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా సభ వాయిదా పడడానికున్న ప్రాముఖ్యత తెలియజేయడంతో పాటు   ప్రస్తుత  బడ్జెట్‌ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగడం వంటి అంశాలపై యూట్యూబ్‌ ఛానెల్‌ లైవ్‌లో తన వ్యాఖ్యానాలతో వివరిస్తున్నారు.

ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు పొందిన ఆయన పార్లమెంటరీ వ్యవస్థ పనితీరును ప్రయోగాత్మకంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నేళ్లుగా లోక్‌సభ, రాజ్యసభ ప్రసారాలు వీక్షిస్తున్న తనకు ఈ సమావేశాలను సరళంగా ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలనే ఆలోచన వచ్చిందని మేఘ్‌నాథ్‌ చెబుతున్నారు. పార్లమెంట్‌ నియమ,నిబంధనలు, సమావేశాలు జరిగే తీరును వివరించేందుకు ఈ మాధ్యమాలు ఉపయోగించుకుంటున్నారు.

సభలో ప్రవేశపెట్టే బిల్లుల ప్రాధాన్యత, ఏదైనా అంశంపై ఎంపీలు నిరసన తెలిపినపుడు ఉత్పన్నమయ్యే పరిస్థితుల్లో సభాపతి ఏ విధంగా వ్యవహరిస్తారు ? వంటి అంశాలను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రాధాన్యతను సంతరించుకోవడంతో దానిపైనే తాను ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్టు ఆయన పేర్కొన్నారు. అదేసమయంలో రాజ్యసభలోనూ ఏదైనా ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంటే దానిపైనా వ్యాఖ్యానాలు చేస్తున్నట్టు చెప్పారు. 
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top