
ప్రతీకాత్మక చిత్రం
దాదాపు ఐదు నెలల క్రితం కేరళలో 243 మందితో బయలుదేరిన నౌక అదృశ్యమైన ఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది.
న్యూఢిల్లీ: దాదాపు ఐదు నెలల క్రితం కేరళలో 243 మందితో బయలుదేరిన నౌక అదృశ్యమైన ఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ నౌక గురించి అన్ని దేశాలను అప్రమత్తం చేశామని.. అయితే ఆయా దేశాల నుంచి ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం అందలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ గురువారం వెల్లడించారు. కేరళలోని ఎర్నాకులం జిల్లా మునంబమ్ నుంచి జనవరి 12న బయలుదేరిన ‘దేవ మాతా–2’అనే పేరున్న నౌక గల్లంతైన విషయం తెలిసిందే. ‘ఇది పసిఫిక్ సముద్రం దిశగా వెళ్లినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆ రీజియన్‌లోని అన్ని దేశాలనూ అప్రమత్తం చేశాం’అని రవీశ్ చెప్పారు.
కాగా, గల్లంతైన నౌకలో 85 మంది చిన్నారులు ఉన్నట్లు వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు. వీరిలో 12 రోజుల వయసున్న చిన్నారి కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజీలు, జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా గుర్తించారు. నెలలు గడుస్తున్నా తమ వారి జాడ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తమ వారిని కనిపెట్టాల్సిందిగా కేంద్ర హోం శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పోలీసులు, జాతీయ మానవ హక్కుల కమిషన్‌లకు సైతం లేఖ రాశారు. దీనిపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనికి సంబంధించి త్వరలో విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్‌ను కలవాలని వారు యోచిస్తున్నారు.