
‘దాస్‌కు ఈమధ్యే పెళ్లి.. మేం అండగా ఉంటాం’
మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవాను కేకే దాస్ కుటుంబాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరామర్శించారు.
కూచ్‌బేహార్: మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవాను కేకే దాస్ కుటుంబాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరామర్శించారు. ఆయన కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ‘సుకుమా జిల్లాలో మావోయిస్టులు చేసిన దాడిలో చనిపోయిన 25మంది సీఆర్‌పీఫ్ జవాన్లలో ముగ్గురు పశ్చిమ బెంగాల్‌కు చెందినవారున్నారు.
వారిలో ఇద్దరు కూచ్ బేహార్ ప్రాంతం వారు. మరోకరు నోయిడా జిల్లాకు చెందినవారు. వీరి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున సహాయం చేయాలని మేం నిర్ణయించుకున్నాం. వాటి కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఒక ఉద్యోగాన్ని కూడా కల్పిస్తాం’ అని ఆమె ప్రకటించారు. ‘27 ఏళ్ల కేకే దాస్ ఇటీవలె వివాహం చేసుకున్నాడు. అందరి కుటుంబాలకు అండగా మేముంటాం’ అని మమత చెప్పారు.