ఉత్కంఠకు తెర : కరుణ అంత్యక్రియలకు తొలగిన అడ్డంకి

Madras High Court Allows Burial For Karunanidhi At Marina Beach - Sakshi

చెన్నై : డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలకు అడ్డంకులు తొలగిపోయాయి. చెన్నై మెరీనా బీచ్‌లో ఆయన ఖననానికి మద్రాస్‌ హైకోర్టు అనుమతి ఇచ్చింది. మెరీనా-అన్నా స్క్వేర్‌ వద్దనే కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించేందుకు మద్రాస్‌ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సాయంత్రం కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. హైకోర్టు వెలువడిన అనంతరం కరుణానిధి కుటుంబసభ్యులు భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. కోర్టు కేసులు, నిబంధనలు సాకుగా చూపి మెరీనా బీచ్‌లో స్థల కేటాయింపులకు తమిళనాడు ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే. దీనిపై డీఎంకే నేతలు మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిపేలా అనుమతి ఇవ్వాలని కోరారు. మెరీనాలో కరుణానిధి అంత్యక్రియలకు స్థల కేటాయింపుపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. 

గతంలో జానకీ రామచంద్రన్‌ అంత్యక్రియల విషయంలో డీఎంకే అనుమతి ఇవ్వలేదని ప్రభుత్వం వాదించింది. ప్రోటోకాల్‌ విషయంలో సిట్టింగ్‌, మాజీ సీఎంలు ఒకటి కాదని ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ వాదనను డీఎంకే న్యాయవాది తప్పుపట్టారు. ద్రవిడ నేతల సమాధుల పక్కనే కరుణానిధి అంత్యక్రియలు జరుపాలని డీఎంకే న్యాయవాది కోరారు. లేదంటే ప్రజల సెంటిమెంట్‌ దెబ్బతింటుందని డీఎంకే న్యాయవాది తెలిపారు. అయితే సెంటిమెంట్ల ఆధారంగా నిర్ణయం తీసుకోలేమని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. రాత్రికి రాత్రే మేనేజ్‌ చేసి, మెరీనా బీచ్‌లో పలువురి స్మారకాలపై అంతకముందు దాఖలు అయిన పిటిషన్లను డీఎంకే ఉపసంహరించేలా చేసిందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. మేనేజ్‌ చేశారనే వాదనపై డీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఓ వైపు ప్రభుత్వం, మరోవైపు డీఎంకే వాదనలు విన్న హైకోర్టు జస్టిస్‌ సుందర్‌, కరుణానిధి అంత్యక్రియలు వారం పాటు వాయిదా వేద్దామా..?అంటూ సీరియస్‌గా వ్యాఖ్యానించారు. కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరిగేలా తీర్పునిచ్చారు. హైకోర్టు తీర్పుపై డీఎంకే నేతలు హర్షం వ్యక్తం చేశారు. మద్రాస్‌ హైకోర్టు తీర్పు విన్న అనంతరం కరుణానిధి కుమారుడు ఎంకే స్టాలిన్‌ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. కాగ, గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కరుణానిధి, మంగళవారం సాయంత్రం 6.10 గంటలకు కన్నుమూశారు. కరుణానిధి మృతితో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రస్తుతం కరుణానిధి పార్థీవదేహాన్ని ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం రాజాజి హాల్‌లో ఉంచారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top