దారుణం.. ఆరోగ్య కార్యకర్తని పట్టించుకోని ఆస్పత్రి సిబ్బంది

Madhya Pradesh Health Worker Collapses In Heat No Help For 25 Minutes - Sakshi

భోపాల్‌: బయట ఎండలు దారుణంగా ఉ‍న్నాయి. ఈ అధిక ఉష్ణోగ్రతలో కాస్తా బిగుతుగా ఉన్న దుస్తులు ధరిస్తే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఒళ్లంతా కప్పి ఉంచే పీపీఈ కిట్లు ధరించి కరోనా పేషంట్లకు సేవలందించే వారికి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఓ సారి ఊహించుకొండి. ఒంటి మీద పీపీఈ కిట్‌ వేడి..  బయట ఎండకి తాళలేక సొమ్మసిల్లి పడిపోయాడు ఓ ఆరోగ్య కార్యకర్త. దారుణం ఏంటంటే అతడు పని చేసే​ ఆస్పత్రి యాజమాన్యం సదరు వ్యక్తికి చికిత్స అందించడానికి నిరాకరించింది. దాంతో దాదాపు 25 నిమిషాల పాటు 44 డిగ్రీల ఎండలో ఆ వ్యక్తి అలానే ఉన్నాడు. తర్వాత అతని సహోద్యోగి ఒకరు మరో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో కోలుకున్నాడు. 

వివరాలు.. హిరలాల్‌ ప్రజాపతి అనే వ్యక్తి 108 అంబులెన్స్‌కు అనుబంధ ఉద్యోగిగా బుండేల్‌ఖండ్ మెడికల్ కాలేజీ(బీఎంసీ)లో పని చేస్తున్నాడు. టీబీ హాస్పిటల్ నుంచి బీఎంసీకి కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులను తీసుకెళ్లే విధులు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో విధుల్లో ఉన్నంతసేపు ప్రజాపతి పీపీఈ కిట్‌ ధరించి ఉంటాడు. దాంతో అధిక వేడికి తట్టుకోలేక ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బీఎంసీ ప్రాంగణంలో కుప్పకూలాడు. అయితే ఆస్పత్రి యాజమాన్యం ప్రజాపతికి చికిత్స అందించడానికి నిరాకరించడంతో దాదాపు  25నిమిషాల పాటు అలా ఎండలోనే ఉండిపోయాడు. (‘గాలి ఆడక.. చెమటతో చాలా ఇబ్బంది పడ్డాం’)

అనంతరం ప్రజాపతి సహోద్యోగి ఒకరు పారామెడికల్‌ సిబ్బంది సాయంతో అతడిని మరో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రస్తుతం అతడు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే బీఎంసీ అధికారుల తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top