నష్టాల ఊబిలో మోనోరైలు | losses in the mono rail | Sakshi
Sakshi News home page

నష్టాల ఊబిలో మోనోరైలు

Jun 10 2014 10:26 PM | Updated on Oct 16 2018 5:04 PM

నష్టాల ఊబిలో మోనోరైలు - Sakshi

నష్టాల ఊబిలో మోనోరైలు

ఇటీవల ప్రారంభమైన మోనోరైలుకు ఇంకా మంచి రోజులు రాలేదు. నిత్యం దీనికి దాదాపు రూ.రెండు లక్షల వరకు నష్టం వస్తోంది.

 సాక్షి, ముంబై: ఇటీవల ప్రారంభమైన మోనోరైలుకు ఇంకా మంచి రోజులు రాలేదు. నిత్యం దీనికి దాదాపు రూ.రెండు లక్షల వరకు నష్టం వస్తోంది. దేశంలోనే మొదటిసారిగా ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన మోనోరైలు ప్రాజెక్టుకు ముంబైకర్ల నుంచి మంచి స్పందన వస్తుందని ముంబై ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) భావించింది.

ప్రజలకు, ముఖ్యంగా ఉద్యోగులకు సౌకర్యవంతంగా లేకపోవడంతో ఎక్కువ మంది దీని సేవలను వినియోగించుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే మోనో నష్టాలు బాట పట్టిందని చెబుతున్నారు. గత ఆదివారం నుంచి  మెట్రో సేవలు ప్రారంభమైనప్పటి నుంచి ఉదయం, సాయంత్రం ఉద్యోగుల నుంచి మంచి స్పందన వస్తోంది. వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మార్గంలో అనేక ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు ఉన్నాయి.
 
దీంతో ఉద్యోగుల్లో అత్యధికులు ఆఫీసులకు వెళ్లేందుకు మెట్రోరైలును ఆశ్రయిస్తున్నారు. ఇది అందుబాటులోకి రావడంవల్ల ట్యాక్సీ, ఆటోచార్జీలు, సమయం ఆదా అవుతున్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళ ల్లో మెట్రోరైళ్లన్నీ ఉద్యోగులతో కిటకిటలాడుతున్నాయి. చెంబూర్-వడాలా వరకు నిర్మించిన మోనో రైలు మార్గంలో కార్పొరేట్ కార్యాలయాలు అంతగా లేవు. దీంతో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పరుగులు తీస్తున్న మోనో రైలు రోజుకు రూ.రెండు లక్షల మేర నష్టాన్ని చవిచూస్తోంది.
 
దీని నిర్వహణ బాధ్యతలు సేకరించిన స్కోమీ ఇంజినీరింగ్ సంస్థ రైలు ట్రిప్పుల సంఖ్యను తగ్గించింది. ప్రతీ 15 నిమిషాలకు ఒక రైలును నడుపుతోంది. గడియారంలోని ముల్లులాగా పరుగులు తీసే ముంబైకర్లకు మోనో రైలు సేవలు అంతగా ఉపయోగపడడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ రైల్లో రోజుకు 20 వేల మంది ప్రయాణికులు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సరదా కోసమే ఈ రైల్లో ప్రయాణిస్తున్నారు. మెట్రోరైలు ప్రారంభించిన మరుసటి రోజు నుంచి  దాదాపు రెండు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు.
 
వడాలా-సాత్‌రాస్తా రెండో దశ పనులు వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ మార్గం పూర్తయితే మోనో మరిన్ని ప్రాంతాలకు విస్తరించి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని  ఎమ్మెమ్మార్డీయే డెరైక్టర్ దిలీప్ కవట్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement