కూలీ డబ్బులు అడిగాడని.. వేళ్లు నరికేశారు

Labour Agents Chop Off His Fingers And Toes As Punishment In Nagpur - Sakshi

నాగ్‌పూర్‌ : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తను చేసిన పనికి కూలి అడిగిన ఓ 60 ఏళ్ల వృద్ధున్ని ఇద్దరు వ్యక్తులు అతి దారుణంగా హింసించారు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన చమ్రూ పహరియాకు పని కల్పిస్తామని చెప్పి కొందరు వ్యక్తులు నాగ్‌పూర్‌కు తీసుకువచ్చారు. అక్కడ ఒక కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో ఈ ఏడాది జూలైలో బాండెడ్‌ లేబర్‌గా చమ్రూను పనిలో చేర్చుకున్నారు. అయితే కొంతకాలం తరువాత చమ్రూ తనకు రావాల్సిన డబ్బులు అడగడంతో డోలాల్‌ సట్నామి, బిడేసి సునామి అనే ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడికి దిగారు. చమ్రూను దారుణంగా కొట్టడమే కాకుండా.. కుడి చేతి మూడు వేళ్లను, కుడి కాలి ఐదు వేళ్లను పదునైన ఆయుధంతో కత్తిరించారు. 

ఈ దాడి అనంతరం చమ్రూకు ఏం చేయాలో తోచలేదు. భయంతో తన సొంతూరు వెళ్లేందుకు నాగ్‌పూర్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాడు. అయితే గాయాలతో ఉన్న చమ్రూను గుర్తించిన రైల్వే పోలీసులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత చమ్రూ కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో అతన్ని తిరిగి వారి ఊరికి తీసుకెళ్లారు. దిలీప్‌కుమార్‌ అనే ఉద్యమకారుడు చమ్రూకు న్యాయం చేయాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించాడు. అలాగే చమ్రూ కుటుంబానికి తగిన పరిహారం చెల్లించేలా అధికారులను ఆదేశించాలని కోరాడు. ఈ ఘటనపై చమ్రూ కుమారుడు తులరామ్‌ మాట్లాడుతూ.. ‘మా కుటుంబానికి వారు తీవ్ర అన్యాయం చేశారు. మా నాన్న తన పనులు కూడా తాను చేసుకోలేపోతున్నాడు. కనీసం చేతులతో ఏ వస్తువును కూడా పట్టుకోలేకపోతున్నాడ’ని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ ఘటనపై మాట్లాడేందుకు చమ్రూ మాత్రం భయపడుతున్నాడు. మరోవైపు చమ్రూపై దాడికి దిగిన వ్యక్తులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top