గౌరీ లంకేశ్‌ హత్య కేసు.. నిందితుల గుర్తింపు?

KN Govt says Gauri Lankesh killers identified - Sakshi

సాక్షి, బెంగళూర్‌ : సంచలనం రేపిన జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్య కేసులో ప్రధాన నిందితులను గుర్తించామని కర్ణాటక ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక విచారణ బృందం(సిట్‌) బలమైన సాక్ష్యాలను సేకరించే పనిలో నిమగ్నమైనట్లు హోం శాఖ మంత్రి రామలింగా రెడ్డి మీడియాతో తెలిపారు. 

హంతకులెవరో మాకు తెలుసు. త్వరలో అన్ని విషయాలను వెల్లడిస్తాం అని ఆయన చెప్పారు. అయితే అందుకు సంబంధించి సరైన సాక్ష్యాలను సేకరించే పనిలో సిట్‌ బిజీగా ఉందని, ప్రస్తుతానికి మిగతా విషయాలను మీడియాకు వెల్లడించటం కష్టమని రామలింగా రెడ్డి చిక్‌ బల్లాపురాలో విలేకరులతో చెప్పారు. అదే సమయంలో సెప్టెంబర్‌ 9వ తేదీకి సంబంధం ఉందంటూ ఆయన వ్యాఖ్యానించటంతో ఆసక్తికర చర్చ మొదలైంది. 

సెప్టెంబర్‌ 5న తన ఇంటి వద్ద గౌరీ లంకేశ్‌ను దుండగలు దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆమెను హత్య చేసింది అతివాద హిందుత్వవాద సంఘమని పలువురు ఆరోపిస్తుండగా.. నక్సలైట్‌ సంఘాల పని అయి కూడా ఉండొచ్చన్న అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తం చేశారు.  ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం నిందితుల ఆచూకీ చెప్పిన వారికి 10 లక్షల రూపాయల రివార్డు ప్రకటించటంతోపాటు ఇంటెలిజెన్స్‌ ఐజీపీ బీకే సింగ్‌ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top