‘ఎన్నిసార్లు అడిగినా రిపేర్‌ చేయలేదు’

Kerala Police Applauded For Their Response Over Boy Letter Of Cycle Repair - Sakshi

తిరువనంతపురం: తమ సైకిళ్లను రిపేర్‌ చేయకుండా ఆలస్యం చేస్తున్న వ్యక్తిపై ఓ పిల్లాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు షాపు యజమానితో మాట్లాడి.. ఆ చిన్నారి ముఖంలో నవ్వులు పూయించారు. ఈ ఘటన కేరళలో జరిగింది. వివరాలు.. కోజికోడ్‌కు చెందిన అబిన్‌(10) ఐదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో తన సైకిల్‌తో పాటు తన అన్న సైకిల్ కూడా పాడైపోవడంతో దగ్గర్లో ఉన్న షాపులో సెప్టెంబరు 5న రిపేరుకి ఇచ్చాడు. అయితే రెండు నెలలు గడిచినా షాపు యజమాని మాత్రం వారి సైకిళ్లు బాగుచేయలేదు. దీంతో తమ సైకిళ్లను రిపేర్‌ చేయించేలా మెకానిక్‌ను ఆదేశించాలని నవంబరు 25న అబిన్‌ పోలీసులకు లేఖ రాశాడు. తమ సైకిళ్లను తిరిగి ఇవ్వకుండా షాపు మూసేశారని లేఖలో పేర్కొన్నాడు

ఈ క్రమంలో అబిన్‌ అభ్యర్థనను మన్నించిన పోలీసులు ఓ మహిళా అధికారిని షాపునకు పంపించి.. సైకిళ్లను రిపేర్‌ చేయించారు. తన కొడుకు పెళ్లి కారణంగా మెకానిక్‌ రెండు నెలలుగా షాపు మూసివేసినట్లుగా వెల్లడించారు. ఈ విషయాన్ని కేరళ పోలీసులు ఫేస్‌బుక్‌లో షేర్‌ చేయడంతో వెలుగులోకి వచ్చింది. సైకిళ్లతో పాటు అబిన్‌ అతడి సోదరుడు ఉన్న ఫొటోలు చూసిన నెటిజన్లు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిన్నారుల సమస్యను తీర్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అదే విధంగా అబిన్ ధైర్యాన్ని కూడా కొనియాడుతున్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top