భారతీయుడిని రక్తం వచ్చేలా కొట్టారు! | Kerala man racially abused and attacked in Australia | Sakshi
Sakshi News home page

భారతీయుడిని రక్తం వచ్చేలా కొట్టారు!

Mar 26 2017 9:09 PM | Updated on Sep 5 2017 7:09 AM

భారతీయుడిని రక్తం వచ్చేలా కొట్టారు!

భారతీయుడిని రక్తం వచ్చేలా కొట్టారు!

ఆస్ట్రేలియాలో కొందరు దుండగులు ప్రవాస భారతీయుడిని జాతి వివక్షతో దూషించి, రక్తం వచ్చేలా దాడి చేశారు.

సిడ్నీ: ఆస్ట్రేలియాలో కొందరు దుండగులు ప్రవాస భారతీయుడిని జాతి వివక్షతో దూషించి, రక్తం వచ్చేలా దాడి చేశారు. హోబర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఈ జాతి విద్వేష చర్య జరిగింది. కేరళలోని కొట్టాయం జిల్లా పుత్తుప్పల్లికి చెందిన లీ మ్యాక్స్ జాయ్ అనే యువకుడు నర్సింగ్ కోర్సు చేస్తూ ట్యాక్సీ డ్రైవర్‌గా పార్ట్‌ టైమ్ జాబ్ చేస్తున్నాడు. అతను మెక్ డొనాల్డ్ రెస్టారెంట్‌కు కాఫీ తాగేందుకు వెళ్లాడు. అప్పటికే రెస్టారెంట్‌లో ఉన్న ఓ మహిళ సహా ఐదుగురు అక్కడి సిబ్బందితో గొడవ పడుతున్నారు. గొడవ పడొద్దని మ్యాక్స్ జాయ్ వారికి సూచించాడు.

తీవ్ర ఆవేశానికి లోనైన మహిళ సహా ఐదుగురు వ్యక్తులు మ్యాక్స్ జాయ్‌తో గొడవకు దిగారు. 'బ్లడీ బ్లాక్ ఇండియన్స్' అంటూ అతడిపై నోరు పారేసుకున్నారు. రెస్టారెంట్లో ఉన్న మరికొందరు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే దుండగులు మ్యాక్స్‌ను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు. రాయల్ హోబర్ట్ హాస్పిటల్‌కు తరలించి అతడికి చికిత్స అందించారు. కారు పార్కింగ్‌లో తొలుత గొడవపడ్డారని, ఆపై రెస్టారెంట్లో ఆ కోపాన్ని తనపై ప్రదర్శించారని బాధితుడు మ్యాక్స్ తెలిపాడు.

ఆస్ట్రేలియాలో జాతి విద్వేష దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఈ విషయంలో విదేశాంగ మంత్రి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. తనకు న్యాయం చేసేందుకు పోలీసులుగానీ, అధికారలు గానీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించాడు. కొట్టాయం ఎంపీ జోస్ కె మణి ఈ జాతి విద్వేష దాడిని తీవ్రంగా ఖండించారు. విదేశాంగ మంత్రిని కలుసుకుని సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement