టోల్‌ ప్లాజా వద్ద ఎమ్మెల్యే వీరంగం

Kerala Lawmaker Breaks Barricade At Toll Plaza - Sakshi

త్రిసూర్‌, కేరళ : టోల్‌ ఫీజు కట్టమంటూ తన వాహనాన్ని ఆపేయడంతో ఆగ్రహానికి గురైన ఓ ఎమ్మెల్యే బారికేడ్‌ను విరగ్గొట్టి వీరంగం సృష్టించారు. కేరళకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే పీసీ జార్జ్‌ తన ఆడీ కారులో రైల్వే స్టేషనుకు బయల్దేరారు. జార్జ్‌ కారుపై ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్‌ను గమనించని టోల్‌ ప్లాజా సిబ్బంది ఆయన కారును చాలా సేపు ఆపేశారు. దీంతో ఆగ్రహానికి గురైన జార్జ్‌ కారులో నుంచి దిగి ఆటోమేటిక్‌ బారికేడ్‌ను ధ్వంసం చేశారు. ఇందుకు ఆయన డ్రైవర్‌ కూడా సాయం చేశాడు. తర్వాత టోల్‌ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ తతంగమంతా టోల్‌ ప్లాజా వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డు కావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ విషయమై టోల్‌ ప్లాజా సిబ్బంది నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

నాకు వేరే ఆప్షన్‌ లేదు...
ఈ ఘటనపై స్పందించిన జార్జ్‌ మాట్లాడుతూ.. ‘నేను రైల్వే స్టేషనుకు వెళ్లాల్సిన తొందరలో ఉన్నాను. టోల్‌ ప్లాజా సిబ్బంది నా కారుపై ఉ‍న్న స్టిక్కర్‌ను చూశారు. అయినా కూడా చాలా సేపటిదాకా వెయిట్‌ చేయించారు. ఈలోగా నా వెనుక ఉన్న వాహనదారులు హారన్‌ కొట్టడం ప్రారంభించారు. దీంతో నాకు కోపం వచ్చింది. నాకు వేరే ఉపాయం కనిపించలేదు’ అంటూ వివరణ ఇచ్చారు. కాగా గతంలోనూ జార్జ్‌ ఇటువంటి చర్యలతో పలుమార్లు వార్తల్లోకెక్కారు. తనకు చెందిన హాస్టల్‌లో క్యాంటీన్‌ బాయ్‌  భోజనం ఆలస్యంగా తీసుకొచ్చాడన్న కారణంతో జార్జ్‌ అతడిపై దాడి చేశారు. అంతేకాకుండా తనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిరసనకారులపై కాల్పులు జరిపారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top