కేరళ వరదలు : సాయం వద్దంటే నిధులెలా..? | Sakshi
Sakshi News home page

కేరళ వరదలు : సాయం వద్దంటే నిధులెలా..?

Published Wed, Aug 22 2018 7:54 PM

Kerala Finance Minister Thomas Issac On Flood Relief - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేరళలో వరద సహాయక చర్యలకు అంతర్జాతీయ సాయాన్ని తాము ఆమోదించబోమని భారత్‌ విస్పష్టంగా పేర్కొందని థాయలాండ్‌ అంబాసిడర్‌ ట్వీట్‌ చేయడంతో కేరళ పునర్నిర్మాణంపై విస్తృత చర్చ మొదలైంది. కేరళకు కేంద్రం ప్రకటించిన సాయం ఏమాత్రం సరిపోని క్రమంలో ఇతరులు చేసే సాయాన్ని కేంద్రం తిరస్కరించరాదని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి థామస్‌ ఇస్సాక్‌ తేల్చిచెప్పారు.

వరదలతో తల్లడిల్లిన కేరళకు దుబాయ్‌ రూ 700 కోట్ల సాయం అందించేందుకు ముందుకు రాగా ప్రధాని నరేంద్ర మోదీ నిరాకరించారని కేరళ సీఎం పినరయి విజయన్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. వరద సాయం కింద తాము కేంద్రాన్ని రూ 2000 కోట్లు కోరితే కేవలం రూ 600 కోట్లు ఇచ్చారని, ఈ పరిస్థితుల్లో ఇతర ప్రభుత్వం, వ్యక్తులు సాయంతో ముందుకు వస్తే ఎందుకు కేంద్రం అడ్డుపడుతున్నదో తనకు అర్థం కావడం లేదని కేరళ మంత్రి థామస్‌ ఇస్సాక్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

దుబాయ్‌, కేరళల మధ్య దీర్ఘకాల అనుబంధం కొనసాగుతుందని, దుబాయ్‌లో అత్యధిక జనాభా మళయాళీలేనని చెప్పారు. దుబాయ్‌లో దాదాపు 30 లక్షల మంది భారతీయులు పనిచేస్తుంటే వారిలో 80 శాతం మంది కేరళకు చెందినవారేనన్నారు. కేంద్రం ప్రకటించిన వరద సాయం అరకొరగా ఉందని, ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ స్పందన రావడంతో గండం నుంచి గట్టెక్కామని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే కేరళ పునర్నిర్మాణమే ఇప్పుడు తమ ముందున్న సవాల్‌ అన్నారు.

Advertisement
Advertisement