ఆకలితో 'అల'మట.. | Fishermen await help in Uppada area | Sakshi
Sakshi News home page

ఆకలితో 'అల'మట..

Nov 6 2025 6:14 AM | Updated on Nov 6 2025 6:14 AM

Fishermen await help in Uppada area

తుపాను గండం దాటినా కష్టాల సుడిగుండంలోనే మత్స్యకారులు

వేటకు వెళ్లినా చేపలు పడని దైన్య స్థితి 

ఉప్పాడ ప్రాంతంలో సాయం కోసం ఎదురుచూపులు 

సొంత నియోజకవర్గంలో పవన్‌ పలకరింపునకే నోచుకోని పరిస్థితి 

జగన్‌ హయాంలో ఉన్న భరోసా ఇప్పుడు లేదని ఆవేదన

‘సముద్రపు అలలపై బతుకు నావ ఎదురీత. ఆటుపోట్లు దాటుకుంటూ అలుపెరగని సుదీర్ఘ సాహస యాత్ర. కుటుంబ పోషణ కోసం ప్రాణాలొడ్డి మత్స్యకారుల చేపల వేట. వలకు పరిగె చిక్కితేనే బువ్వ దక్కేది. దినదినగండం నూరేళ్ల ఆయుష్షు.. ఇదీ మత్స్యకారుల జీవన చిత్రం’ – ఉప్పాడ నుంచి సాక్షి ప్రతినిధి యిర్రింకి ఉమామహేశ్వరరావు

తుపాను గండం దాటినా కష్టాల సుడిగుండంలోనే కొట్టుమిట్టాడుతున్న మత్స్యకారుల జీవనం ఒడ్డున పడ్డ చేపలా తయారైంది. జగన్‌ ప్రభుత్వ హయాంలో ఉన్న భరోసా తమకు ఇప్పుడు లభించడంలేదని మత్స్యకారులు పేర్కొంటున్నారు. తుపాను ప్రభావంతో రూ.83.21 లక్షల విలువైన 486 బోట్లు, వలలు దెబ్బతిన్నట్టు అధికారిక అంచనా. వాస్తవానికి సముద్రంలోని చేపల వేటనే నమ్ముకుని బతికే 8.50 లక్షల మంది జీవనాన్ని తుపాను అతలాకుతలం చేసింది. 

ఈ ఏడాది ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు చేపల వేట నిషేధం కొనసాగింది. ఆ తర్వాత అరకొరగా వేట కొనసాగినా.. ఇటీవల వర్షాలు, తుపాన్‌ల దెబ్బకు పూర్తిగా ఆగిపోయింది. తుపాన్‌ గండం దాటిపోవడంతో రెండు రోజులుగా సముద్రంలోకి వేటకు వెళ్తున్న మత్స్యకారులకు పరిగె కూడా పడటం లేదని వాపోతున్నారు. ‘అప్పులు తీరే మార్గంలేదు. కుటుంబం గడిచే పరిస్థితి లేదు. ఎట్టా బతికేది.’ అంటూ మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. 

ఉప్పాడ ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన ఏడు వేల కుటుంబాలు
ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ ప్రాంతంలో సుమారు ఏడు వేల మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆవేదనలో మునిగిపోయాయి.  ఉప్పాడ గ్రామంలోని మత్స్యకార ఇళ్లు  సముద్ర కోతకు గురై కూలిపోతున్నా,  ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టడంలేదు. 

తమ ఉపాధిని, ఊరిని కాపాడాలని సెప్టెంబర్‌ 23, 24 తేదీల్లో ఉప్పాడ మత్స్యకారులు ఆందోళనకు దిగి పవన్‌కు అక్టోబర్‌ 10వ తేదీ వరకు డెడ్‌లైన్‌ పెట్టారు. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లిన పవన్‌ ‘వంద రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తానని’ హామీ ఇచ్చారు. తాజా తుపాను వల్ల మరింత కష్టాల్లో చిక్కుకున్న తమను పవన్‌ కనీసం పలకరించి భరోసా ఇవ్వకపోవడంపై  మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పెరుగుతున్న అప్పులు.. తరుగుతున్న ఆదాయం
‘జగన్‌ మాకు ఇంటి స్థలం ఇచ్చారు. సాయం అందించారు’ అని పిఠాపురం నియోజకవర్గంలోని  సుబ్బంపేటకు చెందిన సూరాడ చిన కోదండం గుర్తుచేసుకుంటూ, ఇప్పుడు అంతటి భరోసా ప్రభుత్వం నుంచి లభించడంలేదని పేర్కొన్నాడు. ‘తీసుకున్న డ్వాక్రా రుణానికి నెలకు రూ.6 వేలు, ప్రైవేట్‌ అప్పుల వాళ్లకు రూ.5 వేలు, ఇల్లు గడవడానికి మరో రూ.10 వేలు కలిపి కనీసం రూ.20 వేలకుపైగా అవసరమవుతోంది. ఆదాయం లేదు. దిక్కుతోచడం లేదు’’ అని  కోదండం పేర్కొన్నారు.

వృత్తి రక్షణకు సహకరించాలి
ఉప్పాడతోపాటు సమీప గ్రామాలకు చెందిన దాదాపు 900 బోట్లపై చేపల వేటతో ఏడు వేలకుపైగా  కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ప్రభుత్వం చేపల వేటపై రెండు నెలలు నిషేధం విధించింది. ఇప్పుడు వరుసగా వర్షాలు, తుపాన్‌లతో ఉపాధి కోల్పోయాం. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడంతోపాటు మా వృత్తి రక్షణకు సహకరించాలి. – ఎస్‌.సింహాద్రి, ఉప్పాడ

చేప చిక్కకపోతే పస్తులే..
చేపలు చిక్కకపోతే పస్తులు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకంటే మాకు వేరే వృత్తి తెలియదు. ప్రభుత్వం నిత్యావసర సరుకులతోపాటు ఆర్థిక సాయం కూడా చేయాలి. మమ్మల్ని ఆదుకోవడంతోపాటు మా బతుకుదెరువును కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – పుట్టా అప్పలరావు, ఉప్పాడ

ఆక్వా రంగానికి ‘జగన్‌’ ఆక్సిజన్‌
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలోని మత్స్యకారులకు భరోసా ఇవ్వడంతోపాటు ఆక్వా రంగానికి ఆక్సిజన్‌ అందించారు. మత్స్యకార భరోసా పెంచారు. బోట్లకు డీజిల్‌ సబ్సిడీ పెంచారు. నవరత్నాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి అండగా నిలిచారు. కరోనా కష్టకాలంలోను మత్స్యకారులను ఆదుకున్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగానికి విద్యుత్‌ సబ్సిడీ, ధరలు దక్కేలా చేయడం, మార్కెటింగ్‌ వంటి విషయాల్లో చేపలు, రొయ్యల రైతులకు జగన్‌ అండగా నిలిచారు.  – వడ్డి రఘురామ్, మాజీ వైస్‌ చైర్మన్, 
ఏపీ ఆక్వా కల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ

అందరికీ సాయం అందించాలి
మోంథాకు రాష్ట్రంలో మత్స్యకారులందరూ ఉపాధి కోల్పోయారు. కాగా  కేవలం 23 వేల మందికి మాత్రమే 50 కిలోల బియ్యం, నిత్యావసరాలు ప్రభుత్వం అందిస్తోంది. మిగిలిన అందరికీ నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందాలి.  చేపలు అమ్ముకుని జీవించే మహిళలకు కూడా  సాయం అందించాలి.– అర్జిల్లి దాసు, జాతీయ మత్స్యకార సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి

గంగ పుత్రులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ అండ..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగన్‌ ఐదేళ్లపాటు రాష్ట్రంలోని గంగపుత్రులకు కొండంత అండగా నిలిచి భరోసా కల్పించారు.  మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి)తోపాటు ఆయిల్‌ సబ్సిడీ పెంపు, నవరత్నాలు ద్వారా అనేక సంక్షేమ పథకాలు (డీబీటీ), (నాన్‌–డీబీటీ)తో వారు ఆర్థికంగాను, సామాజికంగాను, రాజకీయంగాను నిలదొక్కుకునేలా చేశారు. జగన్‌ కృషితో రాష్ట్రంలో వేటకు వెళ్లే బోట్ల సంఖ్యే కాకుండా.. వేటపై ఆధారపడి జీవనోపాధి పొందే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. కొన్ని కీలక అంశాలు పరిశీలిస్తే..

» ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి)ని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచడంతోపాటు నిషేధ సమయం ప్రారంభంలోనే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు.
»  మెకనైజ్డ్, మోటరైజ్డ్‌ బోట్లకే కాదు..తెప్పలు ఇతర సంప్రదాయ నావలపై వేట సాగించే వారికి సైతం ఈ సాయాన్ని అందించారు. 
»  గత టీడీపీ పాలనలో ఏటా సగటున 60 వేల మంది లబ్ధి పొందితే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 1.16 లక్షల మంది లబ్ధి పొందారు
»  ఆయిల్‌ సబ్సిడీగా గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.59.42కోట్లు ఇస్తే.. వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.148.04కోట్లు ఇచ్చారు.
»  50 ఏళ్లు పైబడిన మత్స్యకారులకు ఇస్తోన్న పింఛన్‌ గత టీడీపీ హయాం (2014–15)లో 42,729 మందికి వర్తింపచేయగా వైఎస్సార్‌సీపీ హయాంలో 2023–24లో 69,741 మందికి ఇచ్చారు. గత టీడీపీ హయాంలో పింఛన్‌ కోసం రూ.51.57 కోట్లు ఖర్చు చేయగా, వైఎస్సార్‌సీపీ రూ.759.47 కోట్లు ఖర్చు చేసింది.
»  మత్స్యకార భరోసాకు గత టీడీపీ పాలనలో రూ.104.62కోట్లు ఇస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ. 538.01 కోట్లు ఇచ్చింది. 
»  గత టీడీపీ ప్రభుత్వం డీజిల్‌పై లీటర్‌కు రూ. 6.03 చొప్పున సబ్సిడీ ఇవ్వగా, దాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.9కి పెంచింది.
»  వేటకు వెళ్లే ముందు ఆయిల్‌ నింపేటప్పుడేసబ్సిడీని మినహాయించుకుని చెల్లించే వెసులుబాటును కల్పించారు.
»  గతంలో 1,100 బోట్లకు మించి ఆయిల్‌ సబ్సిడీని వర్తింప చేసిన దాఖలాలు లేవు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తెప్పలు, నావలతో సహా ఆయిల్‌ సబ్సిడీని సద్వినియోగం చేసుకున్న బోట్ల సంఖ్య ఏకంగా 23,209కి చేరింది.
»  చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు గత టీడీపీ హయాంలో తొలి ఏడాది రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వగా, ఆ తర్వాత దాన్ని రూ.5 లక్షలకు పెంచారు. ఇలా బాబు హయాంలో 300 మంది వేటకు వెళ్లి మృతి చెందితే కేవలం రూ.11.43 కోట్ల పరిహారం మాత్రమే ఇచ్చారు. ఈ పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో 175 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రూ.16.87 కోట్ల పరిహారాన్ని  అందజేసింది.
»  జీఎస్‌పీసీ పైపులైన్‌ నిర్మాణం వల్ల డాక్టర్‌ కోనసీమ అంబేడ్కర్‌ జిల్లాలో జీవనోపాధి కోల్పోయిన  16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22కోట్లు, ఓఎన్జీసీ పైపులైన్‌ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు ఐదు విడతల్లో రూ.647.44 కోట్లు సాయాన్ని ప్రభుత్వం అందించింది.
»  వివిధ పథకాల ద్వారా ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం రూ.4,913 కోట్ల లబ్ధిని నేరుగా మత్స్యకారులకు అందించింది.

జీవన ఆటు'బోట్లు'
555 రాష్ట్రంలోని మత్స్యకార గ్రామాలు 
2.50 లక్షలు:సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు
8.50 లక్షలు:సముద్రంలో చేపలవేటపై ఆధారపడి జీవించేవారు
రూ.20 లక్షలు: బోటు కనీస విలువ
రూ.5 లక్షలు:  బోటులోని వల విలువ
రూ.1.50 లక్షలు:బోటుపై ఒక్కసారి వేటకు వెళితే అందులోకి బోటుకు డీజిల్, బియ్యం, సరుకుల వ్యయం
రూ.20 లక్షలు: బోటులో వెళ్లే ఎనిమిది మందికి ముందస్తు పెట్టుబడి కింద యజమానికి ఇచ్చేది 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement